Telangana: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు
- 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి
- నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- రామగుండంలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించి ఉన్న ప్రాంతం నుంచి తమిళనాడు వరకు గాలులతో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
సంగారెడ్డి జిల్లా మల్చెల్మలో అత్యధికంగా 3.3 సెంటీమీటర్ల వర్షం కురవగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మద్దుకూరులో అత్యల్పంగా 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, కొన్ని ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు.