Egypt: ఒకేసారి బయటపడిన 250 మమ్మీలు.. భారీ కళాఖండాలు!

250 Coffins Of Mummies were Unearthed In Egypt Saqqara

  • ఈజిప్ట్ లోని సక్కారా సమాధుల నుంచి వెలికి తీసిన శాస్త్రవేత్తలు
  • దేవతల విగ్రహాలూ ఉన్నాయని వెల్లడి
  • అన్నీ క్రీస్తుపూర్వం 500 నాటివని వివరణ

ఈజిప్ట్ లో 2,500 ఏళ్ల నాటి మమ్మీలు బయటపడ్డాయి. దాదాపు 250 మమ్మీల శవపేటికలను కైరోకు సమీపంలోని సక్కారా సమాధుల నుంచి పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీశారు. వాటితో పాటు 150 కంచు విగ్రహాలు, ఇతర వస్తువులు, సామగ్రిని బయటకు తీశారు. అందులో దేవతా విగ్రహాలైన అనూబిస్, ఆమున్, మిన్, ఒసిరిస్, ఐసిస్, నెఫర్టం, బాస్టెట్, హాథర్ తో పాటు ఒకటి తల లేని ఇమోటెప్ విగ్రహం కూడా ఉంది. అవన్నీ క్రీస్తుపూర్వం 500 నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఈజిప్ట్ పురాణాల ప్రకారం సంతాన దేవతైన ఐసిస్ కు పూజలు చేసిన కంచు పాత్రలు లభించాయని సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ అధిపతి ముస్తఫా వజీరీ చెప్పారు. క్రీస్తుపూర్వం 2630, క్రీస్తుపూర్వం 2611 మధ్య ఈజిప్ట్ ను పాలించిన ఫారో దజోసర్ దగ్గర ఆర్కిటెక్ట్ గా పనిచేసిన ఇమోటెప్ కంచు విగ్రహం కూడా లభించిందన్నారు. 

శవపేటికల్లో మమ్మీలతో పాటు తాయెత్తులు, చెక్క బాక్సులు, నెఫిథిస్, ఐసిస్ చెక్క బొమ్మలున్నట్టు పేర్కొన్నారు. ‘బుక్ ఆఫ్ ద డెడ్’ అనే పుస్తకంలో పొందుపరిచిన సూక్తులూ ఓ శవపేటికలో కనిపించినట్టు నిర్ధారించారు. వాటిని నిర్ధారించుకునేందుకు ఈజిప్షియన్ మ్యూజియం ల్యాబ్ కు పంపించారు. కాగా, తవ్వకాల్లో బయల్పడిన ఈ కళాఖండాలన్నింటినీ న్యూ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంకు పంపించనున్నారు. గిజా పిరమిడ్స్ కు సమీపంలో ఈ మ్యూజియంను నిర్మిస్తున్నారు.

  • Loading...

More Telugu News