YSRCP: 2024లో నరసాపురం నుంచే పోటీ చేస్తా: వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు
- ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానో చెప్పనన్న కొత్తపల్లి
- నరసాపురం నుంచి 1983 నుంచి 2014 వరకు పోటీ చేశానని వివరణ
- 2019 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే పోటీ చేయలేదని వ్యాఖ్య
- అన్ని కులాల్లోనూ తనకు పడే ఓట్లు ఉన్నాయన్న కొత్తపల్లి
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా విజయం సాధించిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన రాజకీయ ప్రస్థానం గురించి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తాను నరసాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నరసాపురం నుంచి పోటీ చేయడం ఖాయమన్న కొత్తపల్లి... ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానన్న విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పబోనంటూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం స్థానం నుంచి 1983 నుంచి 2014 వరకు పోటీ చేశానని తెలిపారు. ఒక్క 2019 ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనకు మంచి పట్టు ఉందని చెప్పిన సుబ్బారాయుడు.. అన్ని కులాల్లో తనకు పడే ఓట్లు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న సమయంలోనూ తాను నరసాపురం నుంచి సొంతంగా గెలిచానని కూడా ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే... అటు అసెంబ్లీ అయినా, ఇటు లోక్ సభ సభ్యుడిగా అయినా ఆయన టీడీపీ అభ్యర్థిగానే విజయం సాధించారు. ఒకే ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసింది కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఉమ్మడి ఏపీ కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖతో పాటు కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా సుబ్బారాయుడు పనిచేశారు. 2009 ఎన్నికలకు కాస్తంత ముందుగా ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీలో చేరిన సుబ్బారాయుడు ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారాయుడు 2014లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత తిరిగి టీడీపీలోకి వచ్చిన ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నా... ఇటీవలే పార్టీ అధిష్ఠానంపై ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.