Nara Lokesh: ఏ1 నిందితుడిగా ఉన్న సీఎం జగన్‌రెడ్డి నిర్వహణలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా అవకతవకలతోనే సాగింది: నారా లోకేశ్
- మాయాజాలం ఎక్కడ జరిగిందన్న లోకేశ్
- ఈ వ్యవహారంపై గవర్నర్ దృష్టి సారించాలని డిమాండ్
- అర్హులై ఉండి కూడా ఎంపిక కాని అభ్యర్థులకు న్యాయం చేయాలన్న లోకేశ్
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ నిర్వహణలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు కూడా అవకతవకలతోనే సాగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు సంధించిన లోకేశ్... ఈ వ్యవహారంపై గవర్నర్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
30కి పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న సీఎం జగన్‌రెడ్డి నిర్వహణలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా అవకతవకలతోనే సాగిందని ఆరోపించిన లోకేశ్.. అత్యంత పారదర్శకంగా డిజిటల్ మూల్యాంకనం చేశామని కోర్టుకి జగన్ సర్కారు నివేదించిందని తెలిపారు. డిజిటల్ విధానంలో ఎంపికైన 326 మందిలో 124 మంది మాత్రమే మాన్యువల్ వేల్యూయేషన్‌లో ఎంపిక కావడం వెనుక మతలబు ఏంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
డిజిటల్‌లో మాయాజాలం జరిగిందా?.. లేదంటే మాన్యువల్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయా? అనే దానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఎంపికల్లో సర్కారు ప్రాయోజిత అక్రమాలపై గవర్నర్ దృష్టి సారించాలని లోకేశ్ కోరారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షికమైన న్యాయవిచారణ జరిపించాలని.. అర్హులై ఉండి కూడా ఎంపిక కాని అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.