Andhra Pradesh: గ్రీన్ ఎనర్జీలో ప్రపంచానికి దిక్సూచిగా ఏపీ: మంత్రి అమర్‌నాథ్
- కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్టు ద్వారా 5 వేల మెగావాట్ల ఉత్పత్తి
- రాష్ట్రంలో ఈ తరహాలో 29 ప్రాజెక్టులకు ప్రణాళిక
- వీటితో రాష్ట్రంలోనే 30 వేల మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ
- విశాఖను యూనీకార్న్ హబ్‌గా మార్చే దిశగా కృషి
- దావోస్‌లో సత్ఫలితాలు సాధించామన్న మంత్రి అమర్‌నాథ్
రానున్న కాలంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచ దేశాలకు ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలవనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. దావోస్ పర్యటనలో సీఎం జగన్‌తో కలిసి పాలుపంచుకున్న మంత్రి... మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ పర్యటన వివరాలను వెల్లడించారు.
కర్నూలు జిల్లాలో ఇప్పటికే సీఎం జగన్ శంకుస్థాపన చేసిన గ్రీన్ కో రెనూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా 5 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కానుందని ఆయన తెలిపారు. కర్నూలు గ్రీన్ కో ఎనర్జీ ప్లాంట్ మాదిరే రాష్ట్రంలోని మరో 29 ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను గుర్తించామన్న మంత్రి... అవన్నీ అందుబాటులోకి వస్తే... ఒక్క ఏపీ నుంచే 30 వేలకు పైగా మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని తెలిపారు.
ఇక దావోస్ సదస్సులో ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం జగన్ నేతృత్వంలోని తమ బృందం పారిశ్రామికవేత్తలకు వివరించామని మంత్రి చెప్పారు. దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ కేంద్రంగా పెద్ద సంఖ్యలో చర్చలు జరిగాయని... దేశీయ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు ప్రపంచ ప్రసిద్ది గాంచిన పారిశ్రామికవేత్తలు కూడా ఈ చర్చల్లో పాలుపంచుకున్నారని తెలిపారు.
విశాఖ కేంద్రంగా యూనీకార్న్ హబ్ ఏర్పాటు దిశగా తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విశాఖలో ఉన్న తమ ప్లాంట్ విస్తరణ కోసం ఆర్సెలర్ మిట్టల్ ఎండీ మరో రూ.1,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించారని ఆయన వివరించారు.