Mamata Banerjee: మీ పొట్ట అంత లావుగా అలా పెరిగిందేమిటి?: టీఎంసీ నేతను ప్రశ్నించిన మమతా బెనర్జీ

 Mamata Banergee funny interaction with TMC leader
  • పురూలియాలో సమావేశం
  • హాజరైన సీఎం మమతా బెనర్జీ
  • ఝాల్దా మున్సిపల్ చైర్మన్ పొట్టపై జోకులు
  • ఇరువురి మధ్య సరదా సంభాషణ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ టీఎంసీ నాయకుడు, ఝూల్దా పురపాలక సంఘం చైర్మన్ సురేశ్ కుమార్ పొట్టపై సరదాగా జోకులేసి నవ్వులు పూయించారు. మమతా బెనర్జీ అధ్యక్షతన పురూలియాలో జరిగిన ఓ సమావేశంలో సురేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అయితే, సురేశ్ కుమార్ మాట్లాడేందుకు పైకి లేవగా, ఆయన పొట్టను చూసి మమతా బెనర్జీ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

మమతా బెనర్జీ: ఎందుకని మీ పొట్ట అంత లావుగా ఉంది? మీకు గుండెలో బ్లాక్స్ ఉండి ఉంటాయి. 
సురేశ్ కుమార్: బ్లాక్స్ లేవండీ... నాకు షుగర్, బీపీ కూడా లేదు.
మమతా బెనర్జీ: లేదు లేదు... మీకు ఏదో ఒక జబ్బు ఉండే ఉంటుంది... మీకు లివర్ వాపు అయినా ఉండాలి... ఏమీ లేకపోతే ఇంత పెద్ద మధ్యప్రదేశ్ (పొట్ట) ఎలా వచ్చింది?
సురేశ్ కుమార్: నేను డైలీ 3 గంటల పాటు వ్యాయామం చేస్తాను దీదీ.
మమతా బెనర్జీ: మీరు వ్యాయామం చేస్తారా? ఎక్కడ చేస్తారు? కపాల భాతి ఎలా చేస్తారో  చూపించగలరా? రోజుకు ఎన్నిసార్లు కపాల భాతి చేస్తారు?
సురేశ్ కుమార్: రోజుకు వెయ్యిసార్లు కపలా భాతి చేస్తాను దీదీ.
మమతా బెనర్జీ: అయితే రండి... ఈ స్టేజిపై మీరు 10 వేల సార్లు కపాల భాతి చేస్తే మీకు రూ.10 వేలు ఇస్తాను.
సురేశ్ కుమార్: కపాల భాతి ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు దీదీ.
మమతా బెనర్జీ: మీరు పకోడీలు తినడం మానేయండి... అప్పుడే బరువు తగ్గుతారు. కేవలం అన్నం మాత్రమే తీసుకోండి. అది కూడా రాత్రి ఏడు గంటల్లోపే తినేయండి. రాత్రి భోజనం ఆలస్యంగా తీసుకుంటే మరునాడు 12 గంటల వరకు ఏమీ తినొద్దు. ప్రతి రోజూ ఒక కిలోమీటర్ నడవండి.
సురేశ్ కుమార్: అలాగే దీదీ.

కాగా, ఈ సమావేశం అనంతరం సురేశ్ కుమార్ మాట్లాడుతూ, బరువు తగ్గేందుకు మమత బెనర్జీ ఇచ్చిన సలహాలను తాను ఆచరిస్తానని తెలిపారు. మమతా బెనర్జీ, సురేశ్ కుమార్ ల సంభాషణ తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 
Mamata Banerjee
Suresh Kumar
Fat Belly
Fun
TMC
West Bengal

More Telugu News