Indian cricket: జులై 22 నుంచి టీమిండియా వెస్టిండీస్ సిరీస్ మొదలు
- మూడు వన్డేలు.. ఐదు టీ20లు
- చివరి రెండు టీ20లు ఫ్లోరిడాలో నిర్వహణ
- ఇంగ్లండ్ నుంచి నేరుగా వెస్టిండీస్ కు వెళ్లనున్న టీమిండియా
భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటన ఖరారైంది. జులై 17న ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా వెస్టిండీస్ కు ప్రయాణం అవుతుంది. వెస్టిండీస్ జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే మ్యాచ్ లు జులై 22, 24, 27వ తేదీల్లో జరుగుతాయి.
వన్డే సిరీస్, మూడు టీ20 మ్యాచ్ లకు ట్రినిడాడ్ అండ్ టొబాగో, సేంట్ కిట్స్ అండ్ నెవిస్ ఆతిథ్యమివ్వనున్నాయి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఉంటుంది. కాకపోతే చివరి రెండు టీ20 మ్యాచ్ లు ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ హిల్ లో జరగనున్నాయి. మొదటి టీ20 మ్యాచ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో జులై 29న.. తర్వాతి రెండు టీ20లు సెయింట్ కిట్స్ వార్నర్ పార్క్ లో ఆగస్ట్ 1, 2వ తేదీల్లో జరుగుతాయి. చివరి రెండు మ్యాచ్ లు ఫ్లోరిడాలోని బ్రోవర్డ్ కంట్రీ స్టేడియంలో ఆగస్ట్ 6, 7వ తేదీల్లో నిర్వహించనున్నారు.
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ స్పందిస్తూ.. వెస్టిండీస్ బ్రాండ్ కు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు తమ యువ జట్టు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. గట్టి పోటీనివ్వడంతోపాటు.. రానున్న టీ20 ప్రపంచకప్, వరల్డ్ కప్ లకు సన్నద్ధం అయ్యేందుకు భారత్ తో సిరీస్ ను సద్వినియోగం చేసుకోనున్నట్టు తెలిపాడు.