Divyavani: నారా లోకేశ్ చెపితే టీడీ జనార్దన్ కు నా పాయింట్లు పంపించాను.. ఆయన మోసం చేశారు: దివ్యవాణి
- క్రైస్తవ మతానికి చెందిన పాయింట్లను తాను తయారు చేసుకున్నానన్న దివ్యవాణి
- టీడీ జనార్దన్ కు పాయింట్లు పంపిస్తే... వాటిని వేరే వ్యక్తికి ఇచ్చి మాట్లాడించారని ఆరోపణ
- తన పాయింట్లను వేరే వ్యక్తులకు ఎలా చెపుతారని ప్రశ్నించానన్న దివ్యవాణి
తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత టీడీ జనార్దన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రైస్తవ మతానికి చెందిన పాస్టర్లను తాను సంప్రదించి కొన్ని పాయింట్లను రాసుకున్నానని... వాటిని లోకేశ్ బాబుకు చెప్పానని... మీరేమైనా మాట్లాడాలనుకుంటే టీడీ జనార్దన్ కు పాయింట్లు పంపించాలని లోకేశ్ తనకు చెప్పారని అన్నారు.
మత మార్పిడి అనేది బైబిల్ లో ఎక్కడా లేదని ఆమె చెప్పారు. ఏసుక్రీస్తు అంటే ఒక కులమో, మతమో, ఆచారమో కాదని... దీనికి సంబంధించి తాను 10 నుంచి 15 పాయింట్స్ జనార్దన్ కు వాయిస్ రికార్డింగ్ పంపించానని తెలిపారు. తన పాయింట్లను ఆయన చాలా బాగా విన్నారని చెప్పారు.
ఈ పాయింట్లు తాను చెప్పాను కాబట్టి, ప్రెస్ మీట్ పెట్టి తాను ఈ పాయింట్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నానని... అయితే రెండు రోజుల తర్వాత తెనాలికి చెందిన ఒక క్రైస్తవ సహోదరుడు తన పాయింట్లన్నీ ప్రెస్ మీట్ లో చెప్పారని అన్నారు. ఆ సమయంలో టీడీపీ నేత ఆలపాటి రాజా పక్కన కూర్చొన్నారని చెప్పారు.
అప్పుడు హైదరాబాదులో ఉన్న తాను వెంటనే జనార్దన్ కు ఫోన్ చేశానని... లోకేశ్ గారు మీకు చెప్పమంటే పాయింట్లను మీకు చెప్పానని... తన పాయింట్లను మీరు వేరే వ్యక్తులకు ఎలా చెపుతారని ప్రశ్నించానని దివ్యవాణి తెలిపారు. దీని తర్వాత తాను ఒక ప్రెస్ మీట్ పెట్టానని.. చంద్రబాబుకి, జగన్ కు మధ్య ఉన్న తేడాను చెపుతూ తాను మాట్లాడానని... తాను చెప్పిన విషయాల వల్ల క్రైస్తవుల్లో ఉన్న ఆగ్రహం తగ్గిపోయిందని చెప్పారు. వ్యతిరేకంగా ఉన్న చాలా మంది క్రైస్తవులు సైలెంట్ అయిపోయారని తెలిపారు.
తాను చాలా బాగా మాట్లాడానని చంద్రబాబు, లోకేశ్ కూడా అన్నారనే విషయం తనకు కొందరు చెప్పారని ఆమె తెలిపారు. టీడీ జనార్దన్ తనకు అన్యాయం చేశారని తాను నేరుగా మాట్లాడిన మాట నిజమేనని అన్నారు. అన్యాయం జరుగుతున్నప్పుడు తాను ప్రశ్నించకుండా ఉండలేనని వ్యాఖ్యానించారు. తాను కష్టపడి తయారు చేసుకున్న పాయింట్లను మీరు వేరే వ్యక్తి చేత ఎలా మాట్లాడిస్తారని ప్రెస్ మీట్ లో తాను జనార్దన్ ను ప్రశ్నించానని చెప్పారు.