YS Sharmila: కేసీఆర్ ది దొంగ దీక్ష... సకల జనుల పోరాట ఫలితమే తెలంగాణ: షర్మిల
- కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన షర్మిల
- ఉద్యమాన్ని వాడుకుని గద్దెనెక్కారని విమర్శలు
- ఉద్యమకారులను రోడ్డున పడేశారని ఆగ్రహం
తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. సకల జనుల పోరాట ఫలితంగానే తెలంగాణ సాకారమైందని స్పష్టం చేశారు. కేసీఆర్ గడ్డాలు పెంచి దొంగ దీక్ష చేశారని విమర్శించారు. ఉద్యమాన్ని వాడుకుని గద్దెనెక్కారని మండిపడ్డారు. కానీ ఉద్యమకారులను రోడ్డున పడేశారని, అమరుల కుటుంబాలను ఆగం చేశారని పేర్కొన్నారు. దున్నపోతువా? ముళ్లకంపవా? అంటూ నిలదీశారు.
శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే పట్టించుకోలేదని, తన కుమార్తె ఓడిపోతే మాత్రం కేసీఆర్ వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చాడని ఆరోపించారు. బయ్యారం ఉక్కు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ ఎందుకు నోరు మెదపట్లేదని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపరుడని మోదీ, అమిత్ షా చెబుతున్నారే తప్ప ఎందుకు బయటపెట్టడంలేదని అడిగారు.
కేసీఆర్ కు అధికారం ఇస్తే తెలంగాణ చెట్టుకు పండ్లు వచ్చాయో, ముండ్లు వచ్చాయో ఆలోచన చేయాలని షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చినట్టు? మా తెలంగాణ వాళ్లు కాంట్రాక్టర్లుగా పనిచేయలేరా? అని ఆమె ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు సొంతిల్లు, ఉద్యోగం కల్పిస్తామని షర్మిల భరోసా ఇచ్చారు.