Arjun Tendulkar: అర్జున్ టెండుల్కర్ ను ఆడించకపోవడంపై ముంబై కోచ్ స్పందన ఇదీ..!
- స్క్వాడ్ లో చోటు సంపాదించడం ఒక ఎత్తన్న షేన్ బాండ్
- తుది జట్టుకు ఎంపిక కావడం వేరని కామెంట్
- అర్జున్ తన నైపుణ్యాలను ఇంకా సానబట్టుకోవాలని స్పష్టీకరణ
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ముంబై జట్టుకు మెంటార్. అంతేకాదు, ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడు కూడా. అయితే 2022 సీజన్ మొత్తం మీద 14 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్కదానిలోనూ అర్జున్ టెండుల్కర్ కు ఆడే అవకాశం రాలేదు.
ముంబై ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాల్లేవని ముందుగానే తేలిపోయినా.. లీగ్ దశలో మిగిలిన మ్యాచుల్లో అయినా అర్జున్ టెండుల్కర్ ను చూద్దామన్న అభిమానుల ఆకాంక్షలు నెరవేరలేదు. ఇదే విషయాన్ని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ముందు ప్రస్తావించినప్పుడు ఇయన ఇలా స్పందించారు.
అర్జున్ టెండుల్కర్ తన బ్యాటింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలను ఇంకా సానబట్టుకోవాల్సి ఉందని షేన్ బాండ్ చెప్పాడు. నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా తుది 11 మంది సభ్యుల జట్టులో చోటు సంపాదించుకోవాల్సి ఉంటుందన్నాడు.
‘‘ముంబై వంటి జట్టు స్క్వాడ్ లో చోటు సంపాదించుకోవడం ఒక ఎత్తు. తుది జట్టులో చోటు సంపాదించుకోవడం మరో ఎత్తు. అతడు ఇంకా ఎంతో కష్టపడాలి. ఇంకా ఎంతో మెరుగుపడాలి. అర్జున్ ఆ విధమైన పురోగతి సాధించి, తుది జట్టులో స్థానం సంపాదించుకుంటాడన్న నమ్మకం ఉంది’’ అని షేన్ బాండ్ వివరించాడు. సచిన్ బ్యాటింగ్ వీరుడైతే.. అర్జున్ బౌలింగ్ కెరటం కావడం గమనార్హం. అర్జున్ తుది జట్టులో చోటు కంటే తన ఆటపైనే దృష్టి పెట్టాలంటూ సచిన్ సైతం లోగడ తన కుమారుడికి సూచించాడు.