Cricket: గాయంతో గ్రౌండ్ లో పొర్లాడాను.. నా భార్యాపిల్లలే నన్ను నిలబెట్టారు: రవిచంద్రన్ అశ్విన్
- ఆస్ట్రేలియాలో సిడ్నీ టెస్టుపై అశ్విన్ స్పందన
- నొప్పి మందులు వాడి బౌలింగ్ చేసినట్టు వెల్లడి
- మ్యాచ్ కు పాకుతూ వెళ్లానని కామెంట్
2020–2021లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ ను నెగ్గి భారత్ చరిత్ర సృష్టించింది. ఆ భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ కూడా వున్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో అతడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హనుమ విహారితో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్ ను డ్రాగా ముగించారు. ఆ సమయంలో హనుమ విహారితో పాటు అశ్విన్ కూడా గాయాల బారిన పడ్డాడు.
తాజాగా ఆ మ్యాచ్ గురించి, తనకైన గాయం గురించి అశ్విన్ స్పందించాడు. ఆ మరపురాని సిరీస్ విజయం ఆధారంగా నిర్మించిన వెబ్ సిరీస్ విడుదలలో పాల్గొన్న అతడు.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరికీ గాయాలయ్యాయని, క్రీజులో సౌకర్యవంతంగా కదల్లేకపోయామని చెప్పుకొచ్చాడు. విహారికి తొడ కండర గాయమైందని, చాలా బాధను అనుభవించాడని పేర్కొన్నాడు. తాను కూడా గాయంతో ఫాస్ట్ బౌలింగ్ లో ఆడలేక సతమతమయ్యానన్నాడు. దీంతో స్ట్రయిక్ రొటేట్ చేద్దామంటూ విహారికి చెప్పానన్నాడు.
కొద్దిసేపు విహారి ఫాస్ట్ బౌలర్లు.. తాను స్పిన్ బౌలర్లను ఎదుర్కొనేలా ప్రణాళిక రూపొందించుకున్నామని గుర్తు చేశాడు. ఒకరినొకరం కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్లామని చెప్పాడు. గాయమై కూడా తాను నొప్పి మందులు వాడి 13 నుంచి 14 ఓవర్ల పాటు బౌలింగ్ చేశానని గుర్తు చేసుకున్నాడు.
ఆ సమయంలో నొప్పి భరించలేక నేల మీద పొర్లానని పేర్కొన్నాడు. ఆ సమయంలో తన భార్యా పిల్లలే తనను నిలబెట్టారని చెప్పాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి చెక్ చేశాడని వివరించాడు. ఆ తర్వాత తాను మ్యాచ్ కు పాకుతూ వెళ్లానని, గేమ్ లో రాణించానని అశ్విన్ చెప్పాడు.