Ranveer: ప్రతీకారం కోసం... యూట్యూబ్ లో చూసి బాంబు తయారుచేసి పక్కింటోళ్లపై వేశాడు!
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- భాగ్ పట్ లో రెండిళ్ల మధ్య గొడవలు
- ఎలక్ట్రిక్ బాంబు రూపొందించిన రణవీర్ అనే వ్యక్తి
- పొరుగింటి తలుపుకు అమర్చిన వైనం
- తీవ్రంగా గాయపడిన 17 ఏళ్ల కుర్రాడు
ప్రముఖ వీడియో షేరింగ్ సైట్ యూట్యూబ్ ను సకల కళలు, వృత్తులు, శాస్త్రసాంకేతిక విషయాలు కూడా నేర్పించే అనధికారిక విశ్వవిద్యాలయం అనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయం చేయడం నుంచి ప్రమాదకరమైన బాంబులు తయారుచేయడం వరకు ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే నేర్చుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ కు చెందిన 45 ఏళ్ల రణవీర్ సింగ్ అనే వ్యక్తి యూట్యూబ్ లో వీడియోలు చూసి బాంబు తయారీ మెళకువలను నేర్చుకున్నాడు. అందుకు కారణం పొరుగింటివాళ్లతో గొడవలే.
రణవీర్ వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎంతో శ్రమించి ఓ ఎలక్ట్రిక్ బాంబును తయారుచేశాడు. వీడియోల్లో చూపించినట్టుగా కొన్ని వైర్లను ఉపయోగించి బాంబుకు రూపకల్పన చేశాడు. ఊరిబయట పొలాల్లో పలుమార్లు తాను తయారుచేసిన బాంబును పరీక్షించి చూశాడు. బాగా పనిచేస్తోందని నిర్ధారించుకున్న తర్వాత ఆ బాంబును పొరుగింటి మెయిన్ డోరు వద్ద అమర్చాడు.
పొరుగింటికి చెందిన గౌతమ్ సింగ్ అనే 17 ఏళ్ల కుర్రాడు ఆ డోర్ తెరవడంతో బాంబు పేలింది. ఈ ఘటనలో గౌతమ్ సింగ్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకం పక్కింటి వాడైన రణవీర్ సింగ్ పనే అని తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనిపై ఎస్పీ నీరజ్ స్పందిస్తూ, ఆ వ్యక్తి యూట్యూబ్ లో చూసి బాంబులు తయారుచేయడం తమను విస్మయానికి గురిచేసిందని తెలిపారు. బాంబు ఎలా తయారుచేస్తావో మేం కూడా చూస్తాం అని చెప్పగానే, అతడు కొద్ది సమయంలోనే బాంబును తమ ఎదురుగానే తయారుచేశాడని ఆ ఎస్పీ వెల్లడించారు. అంతేకాదు, కొన్ని అదనపు ఏర్పాట్లతో ఆ బాంబును మరింత శక్తిమంతంగా మార్చేశాడని వివరించారు. దీనిపై యూట్యూబ్ కు లేఖ రాశానని, సమాజానికి హానికరం అయిన ఇలాంటి బాంబు తయారీ వీడియోలను తొలగించాలని కోరానని ఎస్పీ తెలిపారు.