Adivi Sesh: చాలా కాలం తరువాత విశ్వరూపం చూపించిన ప్రకాశ్ రాజ్!
- ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించే ప్రకాశ్ రాజ్
- కొంతకాలంగా దక్కని సరైన పాత్రలు
- ఆయన అభిమానుల్లో పెరుగుతూ పోతున్న అసంతృప్తి
- 'మేజర్' సినిమాలో మరోసారి కట్టిపడేసిన ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్ .. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కెరియర్ పరంగా ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. కేరక్టర్ ఆర్టిస్టుగా వివిధ భాషల్లో ఆయన బిజీ. సరైన పాత్ర పడితే .. డైలాగ్స్ పడితే ఆయన ఏ స్థాయిలో చెలరేగిపోతారనేది నిరూపించే పాత్రలు చాలానే కనిపిస్తాయి. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన పాత్రలు పడలేదనే చెప్పాలి. కానీ మళ్లీ నటుడిగా ఆయన విజృంభించే అవకాశాన్ని 'మేజర్' ఇచ్చిందనే అనాలి.
ఈ సినిమాలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర అక్కడక్కడ మాత్రమే కనిపించినా .. ఆయన చెబుతున్నట్టే కథ సాగుతూ ఉంటుంది కనుక, సినిమా అంతా ఉన్న అనుభూతినే కలుగుతుంది. సందీప్ ఆర్మీలో చేయడం ఇష్టం లేకపోయినా కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయిన తండ్రిగా, కొడుకు తాజ్ హోటల్ ఆపరేషన్ లో ఉంటే ఆ వార్తలు వింటూ టీవీ ముందు టెన్షన్ పడే తండ్రిగా ఆయన నటనకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తండ్రిగా .. దేశమంతా అతనికి నివాళిపడుతూ ఉండటం చూసి గర్వపడే తండ్రిగా ప్రకాశ్ రాజ్ యాక్టింగ్ కట్టిపడేస్తుంది. 'చిన్నప్పుడు నా కొడుకుని భుజాలపై కూర్చోబెట్టుకుని ఈ ప్రపంచాన్ని చూపించాను .. కానీ ఇప్పుడు తన భుజాలపై నన్ను కూర్చోబెట్టుకుని ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నట్టుగా ఉంది" అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకునే ఆ పాత్రను ప్రకాశ్ రాజ్ మాత్రమే చేయగలడు అనిపిస్తుంది.