Tirumala: తిరుమల శ్రీవారి క్యూలైన్ లో భక్తుల తన్నులాట.. భాష విషయంలో ఏపీ భక్తులపై తమిళనాడు భక్తుల దాడి
- ఉరవకొండకు చెందిన వ్యక్తికి గాయాలు
- అశ్విని ఆసుపత్రిలో చికిత్స
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుమల శ్రీవారి ఆలయ సర్వదర్శనం క్యూలైన్ లో భక్తులు తన్నులాడుకున్నారు. ఏపీ, తమిళనాడు భక్తుల మధ్య భాష విషయంలో తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానలా మారి దాడుల వరకు వెళ్లింది. ఈ దాడిలో అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సుధాకర్ అనే భక్తుడికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఏపీ భక్తులపై తమిళనాడు భక్తులు దాడి చేశారని, నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కరోనా ఉపశమించడం, కరోనా నిబంధనలను టీటీడీ సడలించడంతో భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. ఇటు వేసవి సెలవుల నేపథ్యంలోనూ తిరుమలకు తరలివస్తున్నారు. ఇవాళ 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 16 గంటల దాకా సమయం పట్టే అవకాశం ఉంది. గంటకు 8 వేల మందికి దర్శనం కల్పించాల్సి వస్తోంది. నిన్న ఒక్కరోజే 71,196 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,936 మంది తలనీలాలను సమర్పించారు. రూ.3.45 కోట్ల మేర హుండీ ఆదాయం సమకూరింది.