Arjun Tendulker: నీ ఆటను హాయిగా ఆస్వాదించు: సచిన్ తనయుడికి కపిల్ దేవ్ సలహా

Kapil Dev opines on Arjun Tendulker career

  • తనదైన ముద్రవేయలేకపోతున్న సచిన్ తనయుడు
  • ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ లోనూ ఆడని అర్జున్
  • అందరూ సచిన్ తో పోల్చుతున్న వైనం
  • అది సరైన ధోరణి కాదన్న కపిల్ దేవ్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్ లో అరంగేట్రం చేస్తాడని అందరూ భావించారు. అయితే అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబయి ఇండియన్స్ ఒక్క మ్యాచ్ లోనూ ఆడించలేదు. దాంతో సచిన్ అభిమానులు మరోసారి తీవ్ర నిరాశకు గురయ్యారు. అర్జున్ టెండూల్కర్ వయసు ప్రస్తుతం 22 ఏళ్లు. కొన్నాళ్ల కిందట భారత అండర్-19 జట్టుకు ఆడడమే ఇప్పటివరకు అతడి అత్యుత్తమ ఘనత. సచిన్ వంటి మహోన్నత క్రికెటర్ కొడుకై ఉండి కూడా ఇంకా జాతీయ జట్టు తలుపుతట్టకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు. అర్జున్ టెండూల్కర్ ను అతడి మానాన అతడిని వదిలేయాలని కపిల్ దేవ్ సూచించారు. అంతేకాదు, తన ఆటను హాయిగా ఆస్వాదించాలంటూ అర్జున్ టెండూల్కర్ కు సలహా ఇచ్చారు. టెండూల్కర్ అనే ఇంటి పేరు ఉండడం వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయని తెలిపారు. అయితే, అర్జున్ టెండూల్కర్ ఇంకా చిన్నవాడేనన్న విషయం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

"ఎందుకు అతడి గురించి మాట్లాడుతున్నారు? సచిన్ టెండూల్కర్ కొడుకన్న కారణంతోనే అతడి గురించి చర్చిస్తున్నారు. అతడి ఆట అతడ్ని ఆడుకోనివ్వండి... సచిన్ తో అతడిని పోల్చకండి. ఈ సందర్భంగా మీకు ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్ మన్ కుమారుడి గురించి చెబుతాను. తన తండ్రి పేరు ప్రఖ్యాతులతో పోల్చితే తన ఎదుగుదల ఏ మూలకు సరిపోదని భావించి అతగాడు తన ఇంటిపేరు 'బ్రాడ్ మన్' ను తొలగించుకున్నాడు. ప్రతి ఒక్కరూ అతడ్ని తండ్రి బ్రాడ్ మన్ తో పోల్చి చూడడం తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. 

అర్జున్ పైనా అలాంటి ఒత్తిడి తీసుకురాకండి. అతడింకా కుర్రవాడే. సచిన్ వంటి పెద్ద ఆటగాడి కొడుకుని విమర్శించడానికి మనమెవ్వరం? అయితే అర్జున్ టెండూల్కర్ కు ఒక విషయం మాత్రం చెబుతాను. ఇవేవీ పట్టించుకోకుండా ఆటపై దృష్టి పెట్టి ఎంజాయ్ చేయాలి. ఏదీ నిరూపించుకోవాల్సిన అవసరంలేదు. నీ తండ్రిలా కనీసం 50 శాతం కాగలిగినా చాలు... అంతకు మించిన ఘనత ఇంకేమీ ఉండదు" అంటూ కపిల్ దేవ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News