Gouthu Sireesha: సోషల్ మీడియాలో పోస్టు.. గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు
- అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- గత రాత్రి 10 గంటల సమయంలో నోటీసులు
- నేటి విచారణకు హాజరవుతానన్న శిరీష
శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ పోలీసులు గత రాత్రి 10 గంటల సమయంలో నోటీసులు ఇచ్చారు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని, లబ్ధిదారులకు ఈ ఏడాది ఆ రెండు పథకాలు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న ఓ నకిలీ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న ఆరోపణలపై అధికారులు ఆమెకు ఈ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో కోరారు.
కాగా, ఇదే ఆరోపణపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడు, టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ కో ఆర్డినేటర్ అప్పిని వెంకటేశ్‌ను నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. కాగా, నోటీసులు అందుకున్న శిరీష విచారణకు హాజరుకానున్నట్టు చెప్పారు.