Badami Devi: చనిపోయిందని సీబీఐ నిర్ధారించిన మహిళ కోర్టులో ప్రత్యక్షమైంది!
- బీహార్ లో రంజన్ అనే జర్నలిస్టు హత్య
- కీలకసాక్షిగా ఉన్న బాదామి దేవి
- బాదామి దేవి చనిపోయిందని ప్రకటించిన సీబీఐ
- కోర్టుకు వచ్చి తన ఐడెంటిటీ నిరూపించుకున్న మహిళ
బీహార్ పాత్రికేయుడు రాజ్ దేవ్ రంజన్ హత్యకేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చనిపోయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నిర్ధారించిన ఓ మహిళ కోర్టులో ప్రత్యక్షమైంది. ఆమె పేరు బాదామి దేవి. జర్నలిస్టు హత్యకేసులో ఆమె సాక్షి. నిన్న విచారణ సందర్భంగా ముజఫర్ పూర్ న్యాయస్థానానికి విచ్చేసిన బాదామి దేవి తాను బతికే ఉన్నానంటూ న్యాయమూర్తికి తెలిపింది.
తాను చనిపోయినట్టు సీబీఐ ప్రకటించిందని ఆమె ఆరోపించింది. ఎంతో పకడ్బందీ ప్రణాళికతో తాను చనిపోయినట్టు కట్టుకథ అల్లారని వివరించింది. అంతేకాదు, తానే బాదామి దేవి అనేందుకు ఓటర్ ఐడీ, పాన్ కార్డు వివరాలను కోర్టుకు సమర్పించింది.
ఈ సందర్భంగా న్యాయవాది శరద్ సిన్హా స్పందిస్తూ, ఈ కేసులో బాదామి దేవి కీలక సాక్షి అని వెల్లడించారు. అయితే ఆమె చనిపోయినట్టు మే 24న సీబీఐ ప్రకటించిందని, సీబీఐ తీవ్ర నిర్లక్ష్యధోరణికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థే ఇలా వ్యవహరిస్తే ఎలా? అని ప్రశ్నించారు.
సీబీఐ కనీసం ఆ మహిళను కూడా కలవకుండానే, చనిపోయినట్టు ప్రకటించిందని సిన్హా ఆరోపించారు. అంతేకాకుండా, ఆమె మరణించిందంటూ ఓ నివేదిక కూడా సమర్పించారని వెల్లడించారు. దీనిపై న్యాయవాది సిన్హా వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం సీబీఐకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
హిందూస్థాన్ హిందీ దినపత్రిక బ్యూరో చీఫ్ రంజన్ ను కొందరు దుండగులు 2017 మేలో కాల్చి చంపారు. దీనిపై రంజన్ భార్య ఆశా రంజన్... ఆర్జేడీ నేత షాబుద్దీన్ తో పాటు తేజ్ ప్రతాప్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.