TDP: డీజీపీ కార్యాలయంలో గౌతు శిరీష.. 3 గంటలకు పైగా విచారిస్తున్న సీఐడీ
- సోషల్ మీడియాలో పోస్టులపై శిరీషకు సీఐడీ నోటీసులు
- డీజీపీ కార్యాయం, సీఐడీ విభాగంలో విచారణకు హాజరు
- మధ్యాహ్నం 12 గంటల నుంచి జరుగుతున్న విచారణ
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న కారణంతో టీడీపీ మహిళా నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా పలాస ఇంచార్జీ గౌతు శిరీషకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ సదరు నోటీసుల్లో సీఐడీ అధికారులు ఆదేశించగా... గౌతు శిరీష వాటికనుగుణంగానే సోమవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు.
ప్రస్తుతం మంగళగిరి పరిధిలోని డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగంలో గౌతు శిరీషను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొదలైన ఈ విచారణ 3 గంటలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఈ విచారణలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, వాటి నేపథ్యం తదితరాలపై ఆమెను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం.