Telangana: కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు పోలీసులకు 4 వారాల జైలు శిక్ష
- భార్యాభర్తల వివాదంలో నిబంధనలు అతిక్రమించిన జూబ్లీహిల్స్ పోలీసులు
- ఆరోపణలు నిజమేనని తేల్చిన హైకోర్టు
- తీర్పుపై అప్పీల్‌కు 6 వారాల గడువు
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఆరోపణలను నిగ్గు తేల్చిన తెలంగాణ హైకోర్టు రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 6 వారాల గడువు ఇస్తూ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
ఈ కేసు వివరాల్లోకెళితే... ఓ భార్యాభర్తల వివాదం కేసులో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు సుప్రీంకోర్టు నిబంధనల మేరకు నడుచుకోలేదని, సీఆర్పీసీ 41ఏ కింద వారికి నోటీసులు జారీ చేయలేదన్న ఆరోపణలపై హైకోర్టు విచారణ చేపట్టింది. దీంతో జూబ్లీ హిల్స్ ఎస్సై నరేశ్, సీఐ రాజశేఖర్ రెడ్డి, బంజారా హిల్స్ ఏసీపీ సుదర్శన్, జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్‌లకు 4 వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.