woman cyclist: భారత కోచ్ అనుచిత ప్రవర్తన.. మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు!
- స్లోవేనియాలో శిక్షణ క్యాంప్ లో ఘటన
- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సైక్లిస్ట్ ఈ మెయిల్
- వెంటనే ఆమెను భారత్ కు రప్పించిన క్రీడా సమాఖ్య
- విచారణకు రెండు కమిటీల ఏర్పాటు
ప్రముఖ మహిళా సైక్లిస్ట్ ఒకరు.. జాతీయ స్ప్రింట్ టీమ్ చీఫ్ కోచ్ ఆర్కే శర్మపై సంచలన ఆరోపణలు చేసింది. స్లోవేనియాలో శిక్షణ క్యాంప్ సందర్భంగా చీఫ్ కోచ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఆమె ఆరోపించింది. అంతేకాదు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆమె ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు కూడా చేసింది. దీంతో స్పోర్ట్స్ అథారిటీ (క్రీడా సమాఖ్య) వెంటనే ఆమెను భారత్ కు రప్పించింది. ఆమె భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది.
మరోపక్క, స్పోర్ట్స్ అథారిటీ, సైక్లింగ్ ఫెడరేషన్ ఇఫ్ ఇండియా రెండు వేర్వేరు విచారణ కమిటీలను ఏర్పాటు చేశాయి. ఈ కమిటీలు సదరు మహిళా సైక్లిస్ట్ చేసిన ఆరోపణల్లోని నిజా నిజాలను నిగ్గు తేల్చనున్నాయి. చీఫ్ కోచ్ అనుచిత ప్రవర్తనపై మహిళా సైక్లిస్ట్ నుంచి తమకు ఫిర్యాదు అందినట్టు స్పోర్ట్స్ అథారిటీ ధ్రువీకరించింది. ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్స్ ఢిల్లీలో జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్నాయి. దీనికి సన్నాహకంగా శిక్షణ కోసం మహిళా సైక్లిస్ట్ లకు స్లోవేనియాలో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్కే శర్మ 2018 నుంచి సైక్లింగ్ బృందాలకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు.