Brad Pitt: నాకు హాని తలపెట్టాలని చూస్తోంది.. మాజీ భార్య ఏంజెలీనా జోలీపై బ్రాడ్ పిట్ సంచలన ఆరోపణలు

Trying to Inflicting Harm On Me Brad Pitt Allegations On Angelina Jolie

  • వైన్ బిజినెస్ వాటా అమ్మకం కేసులో తాజా అభియోగాలు
  • ఓ కుట్రదారుడికి అమ్మిందని మండిపాటు
  • తన వ్యాపారం పేరు ప్రతిష్ఠలను మంటగలిపేందుకు కుట్ర అని వ్యాఖ్య

మాజీ భార్య ఏంజెలీనా జోలీపై హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ సంచలన ఆరోపణలు చేశాడు. ఏంజెలీనాపై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. ఒకప్పుడు కలిసి చేసిన వైన్ వ్యాపారాన్ని నాశనం చేయడం ద్వారా తనకు హాని తలపెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తోందని బ్రాడ్ ఆరోపించాడు. వైన్ వ్యాపార సామ్రాజ్యంలో వాటా అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం ఇద్దరి మధ్యా నడుస్తున్న కేసులోనే బ్రాడ్ తాజా ఆరోపణలు చేశాడు. 

ఫ్రాన్స్ లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓ వైన్ యార్డ్ తో పాటు షాటూ మిరావళ్ ను 2008లో ఈ మాజీ దంపతులు కొనుగోలు చేశారు. 2014లో ఆ మిరావళ్ లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహ బంధం నుంచి విడిపోయాక గత ఏడాది ఏంజెలీనా.. వ్యాపారంలోని తన వాటాను టెన్యూట్ డెల్ మోండో అనే సంస్థకు అమ్మేసింది. 

అయితే, దానిని బ్రాడ్ సవాల్ చేశాడు. వ్యాపారాన్ని ఎవరికీ అమ్మబోమంటూ ఇద్దరం ఒప్పందం చేసుకున్నామని, కానీ, ఇప్పుడిలా అమ్మేయడం నమ్మకద్రోహమేనని పేర్కొంటూ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. తాజాగా ఆ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన ఆరోపణలు చేశాడు. మిరావళ్ తన కలల ప్రాజెక్టు అని, దానిని సక్సెస్ చేయడంలో ఏంజెలీనా పాత్రంటూ ఏమీ లేదని ఆ వ్యాజ్యంలో బ్రాడ్ పేర్కొన్నాడు. 

ప్రస్తుతం తన వైన్ బిజినెస్ కొన్ని వందల కోట్లకు ఎదిగిందని, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రోజ్ వైన్ తయారీదారుల్లో తన సంస్థ స్థానం సంపాదించిందని చెప్పాడు. కేవలం తన కృషి వల్లే అది సాధ్యమైందని, ఏంజెలీనా పాత్ర ఏమీ లేదని తెలిపాడు. అయితే, విడాకులయ్యాక తనకు తెలియకుండానే తన వాటాను వేరే సంస్థకు అమ్ముకోవడం దారుణమని బ్రాడ్ తన వ్యాజ్యంలో ఆక్షేపించాడు. ఇక, ఏంజెలీనా జోలీ నుంచి వాటాను కొనుగోలు చేసిన టెన్యూట్ డెల్ మోండో సంస్థను రష్యాకు చెందిన యూరీ షెఫ్లర్ అనే వ్యాపారవేత్త పరోక్షంగా నడుపుతున్నాడని, ఇప్పుడు మిరావళ్ ను చేజిక్కించుకునేందుకు రహస్య ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించాడు. 

తెలియని కొత్త వ్యక్తితో బ్రాడ్ ను వ్యాపార భాగస్వామిగా చేయాలని చూసిందని, మనసు నిండా విషమే ఉన్న వ్యక్తికి వాటాను అమ్మేసిందని చెప్పాడు. తద్వారా తన సంస్థ పేరు ప్రతిష్ఠలను మంటగలిపి తనకు హాని చేయాలని చూస్తోందని బ్రాడ్ వివరించాడు.

  • Loading...

More Telugu News