Larence Bishnoi: సల్మాన్ ఖాన్ ను చంపేందుకు రూ. 4 లక్షల ఖరీదైన తుపాకీని విదేశాల నుంచి తెప్పించిన లారెన్స్ బిష్ణోయ్
- ఇటీవల పంజాబీ గాయకుడు మూసేవాలా హత్య
- లారెన్స్ బిష్ణోయ్ పై అనుమానాలు
- జైల్లోనే విచారిస్తున్న పోలీసులు
- సల్మాన్ పై గతంలో హత్యాయత్నం వివరాలు వెల్లడించిన బిష్ణోయ్
ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో ప్రమాదకర గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోమారు తెరపైకి వచ్చింది. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా లారెన్స్ బిష్ణోయ్ గతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను హత్య చేయాలనుకున్న విషయాన్ని కూడా వెల్లడించినట్టు ఓ మీడియాలో కథనం వెలువడింది.
సల్మాన్ ఖాన్ ముంబయిలో నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్ద కొన్నేళ్ల కిందట తన అనుచరుడితో రెక్కీ చేయించాడు. సల్మాన్ ఖాన్ ను గురితప్పకుండా కాల్చి చంపేందుకు ఫిన్ లాండ్ తయారీ అస్సాల్ట్ రైఫిల్ ను కూడా విదేశాల నుంచి తెప్పించాడు. ఈ అధునాతన తుపాకీ ఖరీదు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందట. అయితే, లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడ్ని, ఇతర ముఠా సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ప్లాన్ విఫలమైంది. ఆ తర్వాత ఇతర కేసుల్లో లారెన్స్ బిష్ణోయ్ ని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం అతడు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు.