Bhavani: ఆన్ లైన్ రమ్మీ ఆడి లక్షలు పోగొట్టుకున్న మహిళ.... మనస్తాపంతో ఆత్మహత్య

Woman lost all in online rummy and commits suicide in Chennai
  • కరోనా లాక్ డౌన్ లో పేకాటకు బానిసైన చెన్నై వాసి భవాని
  • నగలు తాకట్టుపెట్టి రమ్మీ ఆడిన మహిళ
  • అక్కచెల్లెళ్ల వద్ద అప్పు చేసి మరీ పేకాట
పేకాట వ్యసనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్తులు హారతి కర్పూరంలా హరించుకుపోతున్నా, కాపురాలు కూలిపోతున్నా పేకాటను వీడలేని ఎందరో జీవితాలు నాశనం చేసుకుంటుంటారు. తమిళనాడుకు చెందిన భవాని ఉదంతం కూడా అలాంటిదే. ఆన్ లైన్ లో రమ్మీ ఆడి లక్షల్లో పోగొట్టుకుని, చివరికి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. 

చెన్నై మనాలి న్యూ టౌన్ లో నివసించే బి.భవాని బీఎస్సీ పట్టభద్రురాలు. ఆమె వయసు 29 సంవత్సరాలు. ఆమెకు భర్త భక్కియరాజ్ (32), ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒకరికి మూడేళ్ల వయసు కాగా, మరొకరికి ఏడాది వయసు. భవాని ఓ ప్రైవేటు హెల్త్ కేర్ సంస్థలో పనిచేస్తుండగా, ఆమె భర్త తొరైపాక్కంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. వీరికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. 

అయితే భవాని కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ రమ్మీకి బానిసగా మారింది. భవాని పేకాట పిచ్చి గమనించిన భర్త, తల్లిదండ్రులు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. వారి మాటలను పెడచెవినపెట్టిన ఆ మహిళ ఎప్పటికైనా భారీగా డబ్బు రాకపోతుందా అన్న ఆశతో ఆన్ లైన్ జూదంలో నిత్యం మునిగితేలేది. ఉన్న డబ్బంతా అయిపోగా, బంగారు నగలు తీసుకుని తాకట్టు పెట్టి ఆన్ లైన్ రమ్మీ ఆడింది. ఆ నగల విలువ రూ.10.5 లక్షలు. 

ఈసారి కూడా భవాని ఆన్ లైన్ రమ్మీలో నష్టపోయింది. నగలు విడిపించుకోవాలంటూ అక్కచెల్లెళ్ల నుంచి అప్పు తీసుకుంది. నగలు విడిపించుకోవడానికి బదులు, ఆ డబ్బును కూడా ఆన్ లైన్ పేకాటలో పెట్టేసింది. ఆ డబ్బులు కూడా పోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన భవాని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Bhavani
Suicide
Online Rummy
Lose
Manali New Town
Chennai
Tamil Nadu

More Telugu News