Cancer: క్యాన్సర్ ను మటుమాయం చేసిన ఔషధం... ట్రయల్స్ లో అద్భుత ఫలితాలు!
- డ్రగ్ ట్రయల్స్ నిర్వహించిన స్లోవన్ కెట్టరింగ్ సెంటర్
- 18 మంది రోగులకు డోస్టార్లిమాబ్ ఔషధంతో చికిత్స
- ఆర్నెల్ల పాటు కొనసాగిన ట్రయల్స్
- సంపూర్ణ ఆరోగ్యవంతులైన వైనం
మానవుడి పాలిట ప్రాణాంతక రుగ్మతల్లో క్యాన్సర్ కూడా ఒకటి. దేహంలో ఏ అవయవాన్నయినా నాశనం చేసి మనిషి మరణానికి దారితీసే క్యాన్సర్ ను ఓ దశ వరకు మాత్రమే నయం చేసే వీలుంటుంది. అయితే, న్యూయార్క్ లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తాజా నిర్వహించిన డ్రగ్ ట్రయల్స్ క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి.
పురీష నాళ క్యాన్సర్ తో బాధపడుతున్న 18 మందిపై స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు డోస్టార్లిమాబ్ అనే ఔషధాన్ని ప్రయోగించారు. వారికి ఆర్నెల్ల పాటు ఈ ఔషధాన్ని ఇచ్చారు. ట్రయల్స్ ముగిసేసరికి ఆశ్చర్యకరంగా, ఆ 18 మంది రోగుల్లో క్యాన్సర్ కణజాలం అదృశ్యమైంది.
ఆ రోగులు గతంలో క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సలతో తీవ్ర శారీరక వేదన అనుభవించారు. వారిలో కొందరికి తీవ్రస్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. ఇలాంటివారందరి పైనా డోస్టార్లిమాబ్ ఔషధం ప్రయోగించగా, ఆర్నెల్ల తర్వాత వారిలో ఏ ఒక్కరిలోనూ క్యాన్సర్ కనిపించలేదు. తదుపరి చికిత్సలు అవసరంలేని రీతిలో వారంతా సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకున్నారు.
డోస్టార్లిమాబ్ ఔషధంలో ల్యాబ్ లో రూపొందించిన అణువులు ఉంటాయి. ఇవి మానవదేహంలోకి ప్రవేశించాక యాంటీబాడీలకు నకళ్లుగా పనిచేస్తూ క్యాన్సర్ కణాల పనిబడతాయి. ఈ ఔషధం వాడిన తర్వాత ఆ 18 మంది రోగులకు ఎండోస్కోపీ, పీఈటీ స్కానింగులు, ఎమ్మారై స్కానింగులు నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ క్యాన్సర్ లేదనే ఫలితాలు రావడంతో పరిశోధకులు సంతోషంతో పొంగిపోయారు.
నిజంగా ఇది క్యాన్సర్ చరిత్రలో అద్భుత పరిణామం అని ఈ ట్రయల్స్ లో పాలుపంచుకున్న డాక్టర్ లూయిస్ ఏ డియాజ్ వెల్లడించారు. ఓ ఔషధంతో క్యాన్సర్ మటుమాయం కావడం ఇదే తొలిసారి అని తెలిపారు.