BJP: బీజేపీ సభలో... ఏపీ రాజకీయాలపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు
- రాజమహేంద్రవరంలో బీజేపీ గర్జనకు జయప్రద హాజరు
- ఏపీని అప్పుల ప్రదేశ్‌గా మారుస్తున్నారని ఆరోపణ
- రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్న మాజీ ఎంపీ
ఏపీ రాజకీయాలపై ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత జయప్రద మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో బీజేపీ గర్జన పేరిట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సభకు హాజరైన సందర్భంగా జయప్రద ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్లనే తాను రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మారుస్తున్నారంటూ జయప్రద ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయికి వెళుతున్నాయని ఆమె చెప్పారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆమె ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండాపోయిందని జయప్రద ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.