Sajjala Ramakrishna Reddy: ఏపీ పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందంటే... సజ్జల చెప్పిన కారణాలు ఇవిగో!
- రెండు లక్షల మంది ఫెయిల్ అంటూ విమర్శలు
- మాల్ ప్రాక్టీస్ చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవడం ఓ కారణమై ఉంటుందన్న సజ్జల
- ఆంగ్ల మీడియం మరో కారణం అయ్యుంటుందని వెల్లడి
ఏపీలో పదో తరగతి ఫలితాలు వెలువడగా, రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవడం ప్రభుత్వ వైఫల్యమేనంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టెన్త్ క్లాస్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకున్నామని, ఉత్తీర్ణత శాతం తగ్గడానికి అది కూడా ఓ కారణం అయ్యుంటుందని అన్నారు. పరీక్షలు పారదర్శకంగా జరిపామా? లేదా? అన్నది తమకు ముఖ్యమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం కూడా ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపి ఉంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు. ఆంగ్ల మాధ్యమం తొలిసారి ప్రవేశపెట్టినందున కొన్ని ఇబ్బందులు సహజమేనని, అందువల్ల కూడా ఉత్తీర్ణత శాతం తగ్గి ఉంటుందని వివరించారు.
కరోనా సంక్షోభం వల్ల గత రెండేళ్లుగా విద్యాసంస్థలు సరిగా నడవలేదని, విద్యార్థుల్లో పోటీతత్వం తగ్గి ఉంటుందని తాము భావిస్తున్నామని వివరించారు.
విమర్శలను తాము పట్టించుకోబోమని సజ్జల స్పష్టం చేశారు. గతంలో 90 శాతం మంది పాస్ అయితే, అంతమంది ఎలా పాస్ అయ్యారంటూ విమర్శించేవారని, ఆ విధంగా విమర్శలు చేసిన వారు ఇప్పుడు మాట్లాడాలని అన్నారు.