GHMC: కేవలం మాటలేనా?.. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మోదీ భేటీపై కేటీఆర్ ట్వీట్!
- మోదీతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల భేటీ
- ఈ భేటీని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్
- హైదరాబాద్‌కు ఏం చేశారంటూ నిలదీత
- తెలంగాణకు మాటలు, గుజరాత్‌కు మూటలంటూ సెటైర్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి చెందిన బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో కార్పొరేటర్లను మోదీ ఆత్మీయంగా పలకరించారని, సమస్యలపై ఆరా తీశారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ భేటీని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. తెలంగాణకు, హైదరాబాద్‌కు ఇప్పటిదాకా ఏం చేశారంటూ ఆ ట్వీట్‌లో మోదీని కేటీఆర్ నిలదీశారు.
హైదరాబాద్ వరద నివారణ నిధుల విషయంలో ఏమైనా పురోగతి ఉందా? మూసీ ఆధునికీకరణ పనులకు సంబంధించి ఏమైనా నిధులు ఇస్తారా? హైదరాబాద్ మెట్రోకు ఏమైనా ఆర్థిక దన్ను ఇస్తున్నారా? ఐటీఐఆర్‌పై ఏమైనా కొత్త మాట చెబుతారా?...ఇలా వరుస ప్రశ్నలను సంధించిన కేటీఆర్... తెలంగాణకు పైసా నిధులివ్వని ప్రధాని మోదీ కార్పొరేటర్లతో మాత్రం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మాటలు మాత్రమే చెబుతూ మూటలన్నీ గుజరాత్‌కు ఇస్తున్నారు అంటూ మోదీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.