teen: మొబైల్ గేమ్స్ ఆడనివ్వలేదని తల్లినే కాల్చిచంపిన బాలుడు
- లక్నోలోని పీజీఐ ప్రాంతంలో దారుణం
- తండ్రి లైసెన్స్ డ్ రివాల్వర్ తో తల్లి తలపై కాల్పులు
- మృతదేహం పక్కనే మూడు రోజులు గడిపిన బాలుడు
- తండ్రికి కాల్ చేసి చెప్పడంతో వెలుగులోకి
అమెరికాలో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న తుపాకీ సంస్కృతి గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది. అప్పుడప్పుడు ఇది భారత్ లోనూ కనిపిస్తోంది. తల్లిదండ్రుల లైసెన్స్ డ్ రివాల్వర్లను దుర్వినియోగం చేసిన ఘటనలు గతంలో వెలుగు చూశాయి. తాజాగా ఇటువంటిదే మరో ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో 16 ఏళ్ల బాలుడు కోపంతో తల్లినే కాల్చిచంపాడు. పట్టణంలోని పీజీఐ ప్రాంతంలో ఇది వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల సాధన భర్త ఆర్మీలో పనిచేస్తూ కోల్ కతాలో విధులు నిర్వహిస్తున్నాడు. కుమారుడు (16), కుమార్తె (10)తో కలసి సాధన లక్నోలోని పీజీఐ కాలనీలో నివసిస్తోంది. గత ఆదివారం బాలుడు మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నాడు. దీన్ని సాధన అడ్డుకుంది. దాంతో అతడిలో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన తండ్రి పిస్టల్ తీసుకుని తల్లి తలపై కాల్చాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన తర్వాత తన సోదరిని వేరొక గదిలో ఉంచి బయట గడియపెట్టాడు. తల్లి శవం పక్కనే మూడు రోజులు గడిపాడు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండడంతో రూమ్ ఫ్రెష్ నర్ కొట్టేవాడు. చివరికి మంగళవారం సాయంత్రం తన తండ్రికి కాల్ చేసి విషయాన్ని తెలిపాడు. బాలుడి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సాధన ఇంటికి చేరుకున్నారు. ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి తన తల్లిని కాల్చి చంపినట్టు వారికి కట్టుకథ వినిపించాడు. రెండున్నర గంటల విచారణ తర్వాత అతడు అసలు విషయాన్ని అంగీకరించాడు.