Gyanvapi: జ్ఞానవాపి మసీదులో సర్వేకు ఆదేశించిన జడ్జికి బెదిరింపులు
- బెదిరింపు లేఖపై ఫిర్యాదు చేసిన జడ్జి రవికుమార్ దివాకర్
- తొమ్మిది మంది పోలీసులతో భద్రత
- మీ నుంచి సరైన నిర్ణయాన్ని ఏ ముస్లిం ఆశించడంటూ లేఖ
ఉత్తరప్రదేశ్, వారణాసిలోని విఖ్యాత కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి ఆనుకునే ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో.. వీడియో సర్వేకు ఆదేశించిన జడ్జికి బెదిరింపు లేఖ అందింది. చేతితో రాసిన బెదిరింపు లేఖ తనకు వచ్చినట్టు జడ్జి రవి కుమార్ దివాకర్.. రాష్ట్ర అడిషినల్ చీఫ్ సెక్రటరీ (హోంశాఖ), డీజీపీ, వారణాసి పోలీసు కమిషనర్ కు సమాచారం ఇచ్చారు. ఇస్లామిక్ ఆగాజ్ మూవ్ మెంట్ తరఫున కాసిఫ్ అహ్మద్ సిద్ధిఖి ఆ లేఖ రాసినట్టు ఆయన పేర్కొన్నారు.
జడ్జి నుంచి తమకు ఫిర్యాదు అందినట్టు వారణాసి పోలీసు కమిషనర్ సతీష్ గణేశ్ ధ్రువీకరించారు. దీనిపై డిప్యూటీ పోలీసు కమిషనర్ వరుణ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బెదిరింపు లేఖ రావడంతో న్యాయమూర్తికి భద్రత కల్పించారు. తొమ్మిది మంది పోలీసులను నియమించినట్టు గణేశ్ తెలిపారు.
‘‘జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ను తనిఖీ చేయడాన్ని సాధారణ ప్రక్రియగా మీరు పేర్కొన్నారు. మీరు విగ్రహారాధన చేసేవారు. మసీదును ఆలయంగా ప్రకటిస్తారు. ఏ ముస్లిం కూడా ఒక ‘కఫీర్, ముర్తిపూజక్’ హిందూ జడ్జి నుంచి సరైన నిర్ణయం వస్తుందని ఆశించడు’’ అని సదరు లేఖలో రాసి ఉంది.