Babar Azam: మరో గొప్ప రికార్డుకు చేరువలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం

Babar Azam on the verge of huge milestone for Pakistan

  • అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు 9,798 పరుగులు సాధించిన బాబర్
  • విండీస్‌తో నేటి నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్
  • ఈ సిరీస్‌లో 202 పరుగులు సాధిస్తే 10 వేల పరుగులు సాధించిన 11వ పాక్ ఆటగాడిగా ఘనత

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఖాతాలో చేరేందుకు మరో రికార్డు సిద్ధంగా ఉంది. రీ షెడ్యూల్ చేసిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లో కనుక బాబర్ మరో 202 పరుగులు సాధిస్తే పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న 11వ బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. 

ఇప్పటి వరకు 200 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల బాబర్ 9,798 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాయ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్న ఆజం.. అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్నాడు. 

పాకిస్థాన్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇంజిమాముల్ హక్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్, జావెద్ మియాందాద్, సలీం మాలిక్, సయీద్ అన్వర్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది, మిస్బావుల్ హక్ పాక్ తరపున 10 వేల పరుగులు సాధించారు. ఇప్పుడు వీరి సరసన బాబర్ చేరనున్నాడు. కాగా, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ కూడా అయిన ఇంజిమాముల్ హక్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు సాధించి ఎలైట్ జాబితాలో చోటు సంపాదించాడు.

  • Loading...

More Telugu News