Lanka Dinakar: జగన్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందా? లేదా?: బీజేపీ నేత లంకా దినకర్
- 2020-21లో పరిమితికి మించి అప్పులు చేశారన్న దినకర్
- రూ. 30 వేల కోట్ల ఉపాధి హామీ నిధులు వస్తే.. రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేదని విమర్శ
- దావోస్ నుంచి జగన్ వట్టి చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా
వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల్లో ముంచేసిందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. ఈ మూడేళ్ల కాలంలో రూ. 8 లక్షల కోట్లు అప్పు చేసింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. 2020-21లో పరిమితికి మించి అప్పులు చేసినందుకే... కొత్త అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 17,923 కోట్లకు కోత పెట్టిందని అన్నారు. ఆర్థిక నిర్వహణ అనేది నిబంధనల మేరకే జరుగుతుందని చెప్పారు.
ఈ మూడేళ్లలో రూ. 30 వేల కోట్ల ఉపాధి హామీ నిధులు రాష్ట్రానికి వచ్చాయని... అయినా రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేనటువంటి అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని దుయ్యబట్టారు. పీఎంఏవై కింద పేదలకు 20 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేస్తే... రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఇళ్లను నిర్మించడం లేదని విమర్శించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా పేదలకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మత మార్పిళ్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారని లంకా దినకర్ ప్రశ్నించారు. తప్పుడు కేసులు, భౌతిక దాడులతో ఇబ్బంది పెడుతున్నది ఎవరని అడిగారు. రివర్స్ పాలనతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఈ రోజు వరకు జగన్ ఒక్క నిజమైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. దావోస్ పర్యటనకు వెళ్లిన జగన్ పెట్టుబడులను ఆకర్షించలేక వట్టి చేతులతో తిరిగొచ్చారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.