amaranthus: తోటకూరే కదా అని తీసి పారేయకండి.. పోషకాలు బోలెడు!
- ఇందులో పీచు పుష్కలం
- ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ ఇంకా ఎన్నో పోషకాలు
- మధుమేహులకు మంచి ఆహారం
- కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సాయం
తోటకూర రుచిలో రారాజు కాకపోవచ్చు. కానీ, ఆరోగ్యానికి మేలు చేసే విషయంలో అమ్మలాంటిదే. దీన్నే అమరాంథస్, చౌలాయ్ గా పేర్కొంటారు. తోటకూరలోనూ ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కటే. చౌకగా లభించే తోటకూరను తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఆకుపచ్చని కూరగాయలు తింటే మంచిదని తరచూ వింటుంటాం. పాలకూర, మెంతికూర, క్యాబేజీకి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ తోటకూరను తినేవారు తక్కువే. తోటకూరను తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో ఫైబర్ (పీచు) ఎక్కువ. ఇది హానికలిగించే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే టోకోట్రెనోల్స్ అనే ఒకరకమైన విటమిన్ ఇ కూడా తోటకూరలో ఉంటుంది. ఇది సైతం కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సాయపడుతుంది.
తోటకూర యాంటీ హైపర్ గ్లైసిమిక్ గా పనిచేస్తుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది. కనుక టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారికి తోటకూర మంచి చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయులను తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించే హార్మోన్ ను విడుదల చేస్తుంది. కనుక వెంటనే ఆకలి అనిపించదు.
ఎముకలు దృఢంగా ఉండేందుకు క్యాల్షియం అవసరమన్న సంగతి తెలిసిందే. తోటకూర నుంచి మన శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది. కనుక తోటకూర తీసుకోవడం ద్వారా ఆస్టియోపోరోసిస్ సమస్యను అధిగమించొచ్చు. తోటకూరలో కీలకమైన లైసిన్ ఉంటుంది. ఇదొక అమైనో యాసిడ్. అలాగే, తోటకూరలో విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ సీ ఉన్నాయి. కనుక శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్, కేన్సర్ పై పోరాటానికి సాయపడుతుంది.