YSRCP: వైసీపీలో జీరో పెర్ఫార్మెన్స్ ఎమ్మెల్యేలు వీరే
- వెలుగులోకి ఆరుగురు ఎమ్మెల్యేల పేర్లు
- వెల్లడి కాని మరో ఎమ్మెల్యే పేరు
- జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు
- ఇద్దరు మాజీ మంత్రులూ జీరో పెర్ఫార్మర్లే
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇటీవలే మొదలుపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందే ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై జగన్ నివేదిక తెప్పించుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా బుధవారం నాటి సమీక్షలో జగన్ ఆ నివేదికను బయటపెట్టేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటిదాకా కాలు మోపని నేతలు ఏడుగురు ఉన్నారంటూ జగన్ చెప్పారు. వీరంతా ఇప్పటిదాకా ఈ కార్యక్రమానికే హాజరు కాలేదని చెప్పిన జగన్...ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను జీరో పెర్ఫార్మెన్స్ కలిగిన నేతలుగా తేల్చారు.
ఈ జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నట్లుగా తేలింది. ఇంకో ఎమ్మెల్యే పేరు బయటకు రాలేదు. ఈ జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉండటం గమనార్హం. అదే సమయంలో జగన్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.