Babar Azam: కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ అజామ్
- అత్యంత వేగంగా 1,000 పరుగుల సాధన
- 13 ఇన్నింగ్స్ లకే బాబర్ సరికొత్త రికార్డు
- 17 ఇన్నింగ్స్ లతో కోహ్లీ పేరిట 1,000 పరుగుల రికార్డు
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్ మరోసారి అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. పాక్ జట్టు కెప్టెన్ అయిన బాబర్ అజామ్ వెస్టిండీస్ పై 103 పరుగులు నమోదు చేశాడు. వరుస వన్డే మ్యాచుల్లో బాబర్ కు ఇది వరుస మూడో సెంచరీ. అంతకుముందు రెండు సెంచరీలు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో నమోదు అయినవే. బాబర్ రెచ్చిపోవడంతో పాక్ జట్టు 306 పరుగుల భారీ లక్ష్యాన్ని అధిగమించి, వెస్టిండీస్ పై విజయం సొంతం చేసుకుంది.
అజామ్ బాబర్ 2016లోనూ వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీలు బాదేశాడు. అవన్నీ వెస్ట్ ఇండీస్ పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగినవే. బుధవారం వెస్టిండీస్ పై తాజా సెంచరీతో బాబర్ మొత్తం 17 అంతర్జాతీయ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ గా వేగంగా 1,000 పరుగులు చేసిన ఆటగాడిగానూ బాబర్ రికార్డు నమోదు చేశాడు. కేవలం 13 ఇన్నింగ్స్ లకే అతడు ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ 17 అంతర్జాతీయ వన్డే ఇన్సింగ్ లకు 1,000 పరుగుల మార్కుకు చేరుకోవడం గమనార్హం.
అత్యంత వేగంగా 1,000 పరుగుల క్లబ్ లో ఏబీ డీవిలియర్స్ (20 ఇన్నింగ్స్ లకు 1,000 పరుగులు), కేన్ విలియమ్సన్ (23 ఇన్నింగ్స్ లు ) ను బాబర్ అజామ్ వెనక్కి నెట్టేశాడు.