Abhishek Bachchan: అభిషేక్ తో కచ్చితంగా నటిస్తా: ఐశ్వర్యారాయ్

Aishwarya Rai wants to work with Abhishek Bachchan again but says family is priority
  • కుటుంబానికి, కుమార్తెకే ప్రాధాన్యం అని చెప్పిన బాలీవుడ్ నటి
  • మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బిజీ
  • ఈ సినిమా కోసం ధైర్యం చేసి వచ్చానన్న ఐశ్వర్య
బాలీవుడ్ సీనియర్ నటి ఐశ్వర్యారాయ్ తన భర్తతో కలసి నటించడానికి సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించింది. వీరిద్దరూ లోగడ రావణ్, దాయ్ అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో సహా ఎన్నో సినిమాల్లో కలసి నటించారు. చివరిగా వీరిద్దరూ కనిపించిన సినిమా 'గురు'. 2007లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. అభిషేక్ బచ్చన్ తో పెళ్లి, తర్వాత వారికి ఒక కుమార్తె, కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉండిపోయింది ఐశ్వర్యారాయ్. 

ఇంత కాలం గ్యాప్ తర్వాత మళ్లీ మణిరత్నం దర్శకత్వంలోనే పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం ఐశ్వర్య పనిచేస్తోంది. నాలుగేళ్ల తర్వాత ఐశ్వర్య నటిస్తున్న సినిమా ఇదే. అభిషేక్ తో కలసి మళ్లీ ఎప్పుడు నటిస్తారు? అన్న ప్రశ్నకు ఆమె ఆకాశం వైపు చూసి.. ‘ఇది జరుగుతుంది’ అని సమాధానం ఇచ్చింది. ఇటీవలే దుబాయిలో ఐఫా అవార్డుల ఫంక్షన్ లో ఐశ్వర్య, అభిషేక్ డ్యాన్స్ చేయడం తెలిసిందే. ఐశ్వర్యతో కలసి నటించడాన్ని ఇష్టపడతానని, సరైన సమయంలో మంచి స్క్రిప్ట్ పై ఇది ఆధారపడి ఉంటుందని అభిషేక్ బచ్చన్ రెండు నెలల క్రితం ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.

‘‘ఇప్పటికీ నా కుటుంబం, నా కుమార్తెకే నా ప్రాధాన్యం. మణి సర్ పొన్నియిన్ సెల్వన్ సినిమాను పూర్తి చేసేందుకు దైర్యం చేసి బయటకు వచ్చాను. అయినా, నా కుటుంబం, ఆరాధ్య  పట్ల నా దృక్పథంలో ఎటువంటి మార్పు లేదు’’ అని ఐశ్వర్యారాయ్ తెలిపింది.
Abhishek Bachchan
Aishwarya Rai
movie

More Telugu News