CJI: రిటైర్ అయ్యాక ఎన్టీఆర్పై పుస్తకం రాస్తా: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
- తిరుపతిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
- ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ
- ఎన్టీఆర్ ఓ సమగ్ర సమతా మూర్తి అని వ్యాఖ్య
- సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ తరఫున వాదించడానికి ఎవరూ రాలేదన్న జస్టిస్ ఎన్వీ రమణ
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై ఎన్టీఆర్ మనిషి అని ముద్ర వేశారని, దానికి తాను గర్విస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాక ఎన్టీఆర్పై పుస్తకం రాస్తానని ఈ సందర్భంగా జస్టిస్ రమణ ప్రకటించారు.
ఎన్టీఆర్తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన చెప్పారు. తిరుపతితో ఎన్టీఆర్కు ఎంతో అనుబంధం ఉందని కూడా ఆయన తెలిపారు. ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని, ఎన్టీఆర్ ఓ సమగ్ర సమతా మూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ఎదిగారని చెప్పారు. జనం నాడి తెలిసిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకున్న సత్తా కలిగిన నేతగా ఎన్టీఆర్ను ఆయన అభివర్ణించారు.
విద్యార్థిగా ఉన్న నాటి నుంచే తాను ఎన్టీఆర్ను అభిమానించేవాడినని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్కు తాను పరోక్షంగా పనిచేశానని తెలిపారు. సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ తరఫున వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆయన పేర్కొన్నారు. అయినా కూడా కేవలం ప్రజాభిమానంతోనే ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారని తెలిపారు. అధికారం కోల్పోయాక ఎన్టీఆర్ వెంట ఎవరూ రాలేదని, ఆ వైనాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఢిల్లీ వెళ్లే సమయంలో ఎన్టీఆర్ తనను తోడుగా తీసుకెళ్లేవారని, ఢిల్లీలో ఆయనకు తాను మందులు అందించానని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.