YSRCP: వివేకా హత్య కేసు సాక్షి గంగాధర్ రెడ్డి మరణంపై అనంతపురం ఎస్పీ వివరణ ఇదే
- పదేళ్ల క్రితమే యాడికి చేరిన గంగాధర్ రెడ్డి కుటుంబం
- బుధవారం ఇంటిలోనే నిద్రించి గురువారం తెల్లారేసరికి మృతి చెందిన వైనం
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
- పోస్టుమార్టం నివేదికలో ఆయన మృత దేహంపై గాయాలు లేని వైనం
- అనారోగ్య కారణాలతోనే మరణించారంటూ అనంతపురం ఎస్పీ ప్రకటన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి అలియాస్ కువైట్ గంగాధర్ రెడ్డి (49) గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
కడప జిల్లా పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి... వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగారు. అయితే పదేళ్ల క్రితమే ఆయన పులివెందులను వీడి, అనంతపురం జిల్లా యాడికిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ఇంటిలోనే నిద్రించిన గంగాధర్ రెడ్డి గురువారం తెల్లారేసరికి విగతజీవిగా కనిపించారు.
ఈ క్రమంలో గంగాధర్ రెడ్డి మరణంపై అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. గంగాధర్ రెడ్డి మరణం అనుమానాస్పదమేమీ కాదని, అనారోగ్య కారణాలతోనే ఆయన మరణించారని ఎస్పీ వెల్లడించారు. గంగాధర్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం జరిపించామని, ఆయన మృత దేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని ఎస్పీ వెల్లడించారు. దీంతో గంగాధర్ రెడ్డి మరణం అనారోగ్య కారణాలతోనే సంభవించిందని ఎస్పీ తెలిపారు.