AP Digital Corporation: వాట్సాప్‌తో ఏపీ సర్కారు ఒప్పందం!... ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీ ప్రకటన!
- వాట్సాప్‌తో జట్టు కట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యం
- ప్రభుత్వ కార్యక్రమాలపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట
- ఒప్పందంపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీ ప్రకటన
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌తో ఓ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్న వాసుదేవ రెడ్డి గురువారం రాత్రి ఓ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వంతో కలిసి వాట్సాప్ పనిచేయనుందని ఆయన వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి వాట్సాప్ పనిచేయనుందని వాసుదేవ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుందని ఆయన వెల్లడించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన విషయంతో పాటు ఈ ఒప్పందం ద్వారా ఎలాంటి ప్రయోజనం దక్కనుందన్న విషయంపై వాసుదేవరెడ్డి తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ ఓ ప్రకటన విడుదల చేశారు.