Jubilee Hills: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు: కార్పొరేటర్ కుమారుడే సూత్రధారి.. రిమాండ్ రిపోర్టులో పోలీసులు

Corporator son is the main accused in Jubilee hills gang rape case
  • గతంలో మనం కలిశామంటూ బాధితురాలితో మాటలు కలిపింది అతడేనన్న పోలీసులు
  • ఆపై ఇంటి వద్ద దించుతానంటూ బాలికను నమ్మించి తీసుకెళ్లిన వైనం
  • కాన్సు బేకరీ వద్దకు తీసుకెళ్లి బాలిక బ్యాగ్, కళ్లద్దాలు, సెల్‌ఫోన్ లాక్కున్న వైనం
  • కారులో తమతోపాటు వస్తేనే ఇస్తామని బెదిరించి తీసుకెళ్లిన నిందితులు
  • విచారణలో పెదవి విప్పని సాదుద్దీన్ మాలిక్
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ప్రధాన సూత్రధారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడేనని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బాలికను తొలుత మాటల్లోకి దింపి ఆకర్షించింది అతడేనని, గతంలోనూ మనం ఒకసారి కలిశామంటూ మాటలు కలిపాడని అందులో పేర్కొన్నారు. ఆపై ఇంటివద్ద దించుతానంటూ నమ్మించి బాలికను తీసుకెళ్లాడు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్దకు తీసుకెళ్లి బాలిక నుంచి బ్యాగ్, కళ్లద్దాలు, సెల్‌ఫోన్ లాక్కున్నాడు. 

అనంతరం బాలికను కారులోనే కూర్చోబెట్టి నిందితులందరూ బేకరీలోకి వెళ్లి తిని, సిగరెట్లు తాగారు. ఆ తర్వాత బాలిక వద్దకు వచ్చి కారులో తమతోపాటు వస్తేనే తీసుకున్న వస్తువులు ఇస్తామని బెదిరించి ఇన్నోవాలో తీసుకెళ్లారు. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

కాగా, ఈ కేసు నిందితుల్లో ఒకడైన సాదుద్దీన్ మాలిక్‌ను నిన్న దాదాపు ఆరు గంటలకుపైగా పోలీసులు విచారించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు అతడు పొడిపొడిగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే, ఈ కేసులోని మిగతా నిందితులైన మైనర్లతో ఉన్న సంబంధాలపై అడిగిన ప్రశ్నకు పెదవి విప్పలేదని సమాచారం.

మరోవైపు, నిందితులైన ఐదుగురు మైనర్లలో ముగ్గురు.. ప్రభుత్వ సంస్థ చైర్మన్ కుమారుడు, సంగారెడ్డి జిల్లా అధికార పార్టీ నేత కుమారుడు, కార్పొరేటర్ కుమారుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు పోలీసులు విచారించనున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులైన ఎమ్మెల్యే కుమారుడు, బెంజ్ ‌కారు యజమాని కుమారుడి కస్టడీపై నేడు తీర్పు వచ్చే అవకాశం ఉంది.

మైనర్లను పోలీసులు సివిల్ దుస్తుల్లో న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. నిందితులను గుర్తించేందుకు బాధితురాలితో టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. అలాగే, నేరాన్ని రుజువు చేసేందుకు అత్యంత కీలకమైన లైంగిక పటుత్వ పరీక్ష (పొటెన్సీ టెస్ట్) కూడా చేయించనున్నారు.
Jubilee Hills
Jubilee Hills Gang Rape
Hyderabad
Saduddin Malik
Police
Remand Report

More Telugu News