Johnny Depp: జానీ డెప్ పరువు నష్టం దావా.. డబ్బుల కోసం కాదు: న్యాయవాది వివరణ
- ప్రతిష్ట పునరుద్ధరణ కోసమేనన్న న్యాయవాది బెంజమిన్
- క్లయింట్ల మధ్య సంభాషణలు వెల్లడించబోమని స్పష్టీకరణ
- ఈ విషయాన్ని ఇంతటితో ముగించే యోచన
హాలీవుడ్ నటుడు జానీ డెప్.. తన మాజీ భార్య, హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ పై పరువు నష్టం వ్యాజ్యాన్ని దాఖలు చేసింది డబ్బు కోసం కాదని, ఆయన తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. తన మాజీ భర్త తనపై వేధింపులకు పాల్పడినట్టు ఆమె వాషింగ్టన్ పోస్ట్ ద్వారా బయట పెట్టడం.. దీనిపై జానీ డెప్ కోర్టులో పరువు నష్టం వ్యాజ్యం వేయడం తెలిసిందే. మాజీ భార్య చేతిలో తాను ఎన్నో అవమానాలు, వేధింపులకు గురైనట్టు జానీ డెప్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తాను సైతం గృహ హింస ఎదుర్కొన్నానంటూ అంబర్ కూడా పరువు నష్టం వ్యాజ్యం వేసింది.
చివరికి ఇద్దరూ పరువు నష్టానికి అర్హులేనని కోర్టు తీర్పు చెప్పగా, జానీ డెప్ వైపు తీర్పు మొగ్గింది. మాజీ భర్తకు 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని (సుమారు 110 కోట్లు) అంబర్ హెర్డ్ ను కోర్టు ఆదేశించింది. తీర్పుతో నిరాశ చెందిన అంబర్ హెర్డ్ తన వద్ద అంత డబ్బు లేదని, తాను చెల్లించే స్థితిలో లేనంటూ న్యాయస్థానానికి విన్నవించుకుంది.
తాజా తీర్పు తర్వాత డెప్, హెర్డ్ ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంబర్ హెర్డ్ పరిహారం చెల్లించాలని డెప్ కూడా కోరుకోవడం లేదని సమాచారం. దీనికి బదులుగా అంబర్ హెర్డ్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లకూడదన్నది షరతు. దీనిపై అతని న్యాయవాది బెంజమిన్ స్పందిస్తూ.. క్లయింట్, అటార్నీ మధ్య జరిగిన సంభాషణలను తాము బయటకు వెల్లడించబోమని తెలిపారు.
‘‘ఇది డబ్బు గురించి కాదు. జానీ డెప్ తన ప్రతిష్టను పునరుద్ధరించుకోవడం కోసం చేసిన ప్రయత్నం. అది జరిగింది’’ అని బెంజమిన్ తెలిపారు. దీంతో మాజీ జంట ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలకొచ్చని తెలుస్తోంది.