Bandi Sanjay: పోలీసుల వలయాన్ని ఛేదించుకుని జేబీఎస్ కు వెళ్లిన సంజయ్
- బస్టాండ్ అంతా కలియతిరిగిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
- ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకున్న సంజయ్
- చార్జీలు ఎవరి కోసం పెంచారంటూ బీజేపీ ఫైర్
రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ సికింద్రాబాద్ జేబీఎస్ లో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ వలయాన్ని ఛేదించుకుని మరీ ఆయన జేబీఎస్ కు చేరుకున్నారు.
బస్టాండ్ లో కలియతిరుగుతూ ప్రయాణికుల ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ సర్కారు ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రయాణికులపై పెనుభారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, చార్జీలు పెంచిన మేర సౌకర్యాలు కల్పించడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సులు కండిషన్ లో లేవని, వాటి నిర్వహణ కూడా సరిగ్గా ఉండదని పేర్కొంది. బస్టాండ్లలో కనీస వసతులు లేవని, శుభ్రత కరవని ఆక్షేపించింది. మరి, ఎవరి బాగు కోసం చార్జీలను పెంచుతున్నారని ప్రశ్నించింది.