Rajya Sabha: రాజ్యసభ ఎన్నికలు: మహారాష్ట్రలో శివసేన కూటమికి బీజేపీ షాక్.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌దే హవా!

Rajya Sabha polls Blow to MVA as BJP snatches 3 seats in Maharashtra

  • ఈ తెల్లవారుజామున వెల్లడైన ఎన్నికల ఫలితాలు
  • కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్
  • రాజస్థాన్‌లో మూడు స్థానాలు కాంగ్రెస్ వశం
  • బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన మీడియా అధినేత సుభాష్ చంద్ర ఓటమి

క్రాస్ ఓటింగ్, నిబంధనల ఉల్లంఘన, గంటల తరబడి జాప్యం వంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో హోరాహోరీగా సాగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఈ తెల్లవారుజామున వెల్లడయ్యాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లోని 16 స్థానాలకు గాను బీజేపీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితంగా ఎగువ సభలో మరింత బలాన్ని కూడగట్టుకుంది. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన స్థానాల్లో మహారాష్ట్రలోని శివసేన కూటమి, హర్యానాలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 

మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు స్థానాలకు గాను బీజేపీ మూడింటిని గెలుచుకుని అధికార కూటమికి షాకిచ్చింది. క్రాస్ ఓటింగ్‌పై వాగ్వివాదం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో కౌంటింగ్ దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమైంది. ఇక్కడ గెలుపొందిన బీజేపీ నేతల్లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఉన్నారు. 

ఇక, మహారాష్ట్రలోని అధికార ఎంవీఏ (మహారాష్ట్ర వికాస్ అఘాడీ) కూటమి బరిలోకి దింపిన అభ్యర్థుల్లో శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్‌సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్ గర్హి విజయం సాధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ, శివసేన రెండూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. 

రాజస్థాన్‌లో పోటీ చేసిన నాలుగు స్థానాల్లో మూడింటిలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, బీజేపీకి చెందిన ఘనశ్యామ్ తివారీ రాజ్యసభకు ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మీడియా అధినేత సుభాష్ చంద్ర ఓటమి పాలయ్యారు.

హర్యానాలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ పోల్ అభ్యర్థి అజయ్ మాకెన్ తగినంత ఓట్లు సాధించడంలో విఫలమై ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత కృషన్‌లాల్ పన్వర్, కాషాయ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కార్తికేయ శర్మకు క్రాస్ ఓటింగ్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధీకృత పోలింగ్ ఏజెంట్ బీవీ బాత్రా ఆరోపించారు. 

కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పోటీ చేసిన మూడు స్థానాలను గెలుచుకుంది. నాలుగు స్థానాలకు గాను బీజేపీ మూడింటిని కైవసం చేసుకోగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఓ స్థానంతో సరిపెట్టుకుంది. జేడీఎస్ మాత్రం రిక్తహస్తాలతో మిగిలిపోయింది. గెలుపొందిన బీజేపీ నేతల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, నటుడు, రాజకీయ నేత జగ్గేష్, లెహర్ సింగ్ సిరోయా విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జైరాం రమేశ్ విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

  • Loading...

More Telugu News