Prophet Muhammad: నుపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై రచయిత్రి తస్లీమా నస్రీన్ షాకింగ్ కామెంట్స్
- నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భారత్ సహా బంగ్లాదేశ్‌లో భారీ ఆందోళనలు
- తీవ్రంగా ఖండించిన తస్లీమా నస్రీన్
- మహ్మద్ ప్రవక్త బతికి ఉంటే ఈ పిచ్చిని చూసి షాకై ఉండేవారంటూ వ్యాఖ్యలు
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా రేగుతూనే ఉంది. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. భారత ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని నినదించారు. భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. హింసాత్మక రూపు దాలుస్తున్న ఈ ఆందోళనలపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆందోళనలను ఖండించిన తస్లీమా.. మహ్మద్ ప్రవక్త కనుక ఇప్పుడు బతికి ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మతోన్మాద పిచ్చిని చూసి ఆయన దిగ్భ్రాంతికి గురై ఉండేవారంటూ ట్వీట్ చేశారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిన్న ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలని, ఉరితీయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తస్లీమా ఈ వ్యాఖ్యలు చేశారు.