foods: రోజువారీగా వీటిని తగ్గిస్తే లివర్ కు మంచిది
- పంచదార, ఆల్కహాల్ తో ఎక్కువ ప్రమాదం
- మైదా పిండి అసలే వద్దు
- ఫాస్ట్ ఫుడ్స్ తో కాలేయ సమస్యలే కాదు, గుండెకీ చేటే
మన శరీరంలో లివర్ పాత్ర ఎంతో విశిష్టమైనది. ఎందుకంటే తీసుకునే ఆహారం, పానీయాల దగ్గర్నుంచి.. అనారోగ్యం వస్తే తీసుకునే ఔషధాల వరకు ప్రతి ఒక్కదాన్ని ప్రాసెస్ చేసే చిన్న పరిమాణంలో ఉన్న పెద్ద ఫ్యాక్టరీయే కాలేయం. శరీరానికి శక్తిని అందించడంలో, శరీరంలోని హాని కారకాలను బయటకు పంపడంలో లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన శరీర అవయవాల్లో అతిపెద్దది కూడా ఇదే. ఆహారం జీర్ణం కావడానికి కావాల్సిన రసాలను ఉత్పత్తి చేస్తుంది. మరి శరీరానికి ఎన్నో సేవలు అందిస్తున్న కాలేయంపై భారాన్ని మోపే ఆహారానికి దూరంగా ఉండడం ఒక్కటే మనం చేయాల్సిన పని.
షుగర్/చక్కెర
పంచదార మన శరీరానికి అవసరం లేని పదార్థం. కాలేయానికి హాని కలిగించే పదార్థం. షుగర్, చాక్లెట్లు, కుకీలు, సోడాలు తదితర పదార్థాల వల్ల కొవ్వులు పేరుకుపోయి లివర్ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల వీలైతే దూరం పెట్టడం లేదంటే చాలా పరిమితం చేయడం ఆరోగ్య రీత్యా అవసరం.
మద్యం
ఆల్కహాల్ సేవనం కాలేయానికి అత్యంత చేటు చేస్తుంది. మద్యం తాగిన తర్వాత కాలేయం దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో జరిగే రసాయన క్రియలు వాపునకు దారితీస్తాయి. కణాలు చనిపోవడానికి, లివర్ ఫైబ్రోసిస్ కు కారణమవుతుంది. అధిక మోతాదులో ఆల్కహాల్ ను దీర్ఘకాలం పాటు తీసుకుంటే లివర్ సిర్రోసిస్ (గట్టి పడిపోవడం) సమస్యకు దారితీస్తుంది. అప్పుడు రక్తపు వాంతులు, కామెర్లు, శరీరంలో అధిక నీరు ఉండిపోవడం, లివర్ కేన్సర్ సమస్యలు కూడా తలెత్తవచ్చు. కనుక ఆల్కహాల్ ను చాలా తక్కువ పరిమాణానికి తగ్గించుకోవాలి. ఒకవేళ లివర్ సమస్యలు కనిపిస్తే ఆల్కహాల్ ను పూర్తిగా మానేయడమే మంచిది.
మైదాపిండి
గోధుమ పిండిని ప్రాసెస్ చేయగా మిగిలిందే మైదా. రసాయనాలతో ప్రాసెస్ చేస్తే అలా తెల్లటి పిండిగా మైదా మారుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు మినహా పీచుకానీ, విటమిన్లు కానీ, ఎటువంటి పోషకాలు కానీ ఉండవు. రక్తంలో గ్లూకోజ్ ను పెంచుతుంది. అన్ని రకాల బేకరీ ఉత్పత్తులు, బిస్కెట్స్ మైదాతోనే తయారవుతాయి.
ఫాస్ట్ ఫుడ్
ఫాప్ట్ ఫుడ్స్ తినడానికి స్పైసీగా ఉండొచ్చు. కానీ జీర్ణం కావడానికి కష్టమైనవి. బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కాలేయానికి మంచివి కావు. వీటివల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడడమే కాదు.. వీటిల్లోని శాచురేటెడ్ ఫ్యాట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి, గుండె జబ్బులకు కారణమవుతాయి.
రెడ్ మీట్
రెడ్ మీట్ లో ఉండే భారీ పరిమాణంలోని ప్రొటీన్ ను విచ్ఛిన్నం చేయడం కాలేయానికి తలకు మించిన పనే. అధిక ప్రొటీన్ పోగుపడడం వల్ల తీవ్రమైన కాలేయ సమస్యలు ఏర్పడతాయి.