Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయంటే...!
- రెండ్రోజుల్లో తెలంగాణ, ఏపీల్లోకి రుతుపవనాలు
- అనుకూలంగా మారిన పరిస్థితులు
- రుతుపవనాలు నిదానంగా కదులుతున్నాయన్న ఐఎండీ
దేశంలో అత్యధిక వర్షపాతం అందించే నైరుతి రుతుపవనాల విస్తరణ ఈసారి ఆలస్యమైంది. సాధారణంగా ఈసరికే తెలంగాణలో నైరుతి సీజన్ మొదలవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ రుతుపవనాల జాడలేదు. దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వివరణ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం ఉందని, మరో రెండ్రోజుల్లో రుతుపవనాలు ఆయా రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయని వెల్లడించింది.
వచ్చే రెండ్రోజుల్లో ఏపీ దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో, ఉత్తర భారతదేశం వైపుగా నైరుతి రుతుపవనాలు వేగంగా కదిలేందుకు అనుకూల వాతావరణం నెలకొందని ఐఎండీ వెల్లడించింది.
ప్రస్తుతం కర్ణాటక, గోవా, కొంకణ్, బెంగళూరు, పుణే, పుదుచ్చేరి ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ వివరించింది. రుతుపవనాల గమనం నెమ్మదిగా ఉండడం వల్ల విస్తరణ ఆలస్యమైందని పేర్కొంది.