Major: తెరపై నిజంగానే శాండీని చూస్తున్నట్టుగా అనిపించింది... మేజర్ చిత్రంపై సందీప్ ఉన్నికృష్ణన్ సహచరుడి మాట
- నాడు ముంబయిలో మారణహోమం
- ఉగ్రవాదులతో పోరులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం
- అడివి శేష్ ప్రధానపాత్రలో మేజర్ చిత్రం రిలీజ్
- చిత్రాన్ని తిలకించిన రజాక్ అదిల్
ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఇందులో తెలుగు యువ నటుడు అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషించాడు. కాగా, మేజర్ చిత్రాన్ని సందీప్ ఉన్నికృష్ణన్ ఎన్ఎస్ జీ సహచరుడు రజాక్ అదిల్ కూడా తిలకించారు. కొన్ని సీన్లలో తెరపై నిజంగానే శాండీ (సందీప్ ఉన్నికృష్ణన్)ని చూస్తున్నట్టుగా అనిపించిందని రజాక్ తన సహచర యోధుడ్ని గుర్తుచేసుకున్నారు.
సందీప్ ఉన్నికృష్ణన్, రజాక్ అదిల్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనూ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగాల్లో పనిచేశారు. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. వెండితెరపై అడివి శేష్ నటనను రజాక్ ఎంతగానో ప్రశంసించారు. తన భావోద్వేగాలను రఫీక్ ఓ లేఖలో పొందుపరిచారు.
"మేజర్ చిత్రం ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈ సినిమా కోసం ఎదురుచూశాను. ఈ సందర్భంగా సందీప్ తండ్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా విషయంలో అడివి శేష్ నాకు కాల్ చేశాడు. సినిమా ఎండ్ పడేసరికి ఏదో కోల్పోయిన భావన ముంచెత్తింది. సినిమా ముగిసేసరికి శాండీని గుర్తుచేసుకున్న ప్రతిసారి ఏదో కోల్పోయిన భావన నన్ను ముంచెత్తుతూనే ఉంది. నా చుట్టూ ఉన్న ప్రేక్షకులకు నేనెవరో తెలియదు. కానీ వారు సినిమా చూస్తున్నంత సేపు వారి స్పందనలు చూస్తుంటే గర్వంతో ఉప్పొంగిపోయాను. చాలామంది బాధతో కనిపించగా, మరికొందరు తీవ్రంగా చలించిపోయారు. మరికొందరు యువతీయువకులు మాత్రం ఎంతో ఉత్సాహంతో, ఈ సినిమా నుంచి ప్రేరణ పొందినట్టుగా కనిపించారు. శాండీ మాకు మాత్రమే సొంతం కాదు... అతను దేశానికి చెందినవాడు అనిపించింది" అని రజాక్ వివరించారు.
అంతేకాదు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడని, శాండీ మేనరిజమ్స్ ను బాగా పట్టేశాడని కొనియాడారు.