Asaduddin Owaisi: దేశవ్యాప్త అల్లర్లపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన
- మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు
- నుపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ
- పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు
- రాంచీలో పోలీసుల కాల్పుల్లో ఇద్దరి మృతి
- నుపుర్ శర్మను అరెస్ట్ చేస్తే అల్లర్లు జరిగేవి కావన్న ఒవైసీ
దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై తీవ్ర వ్యాఖ్యలు చేసిందంటూ దేశంలో అనేక చోట్ల నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి.
దీనిపై ఒవైసీ మాట్లాడుతూ, నుపుర్ శర్మను అరెస్ట్ చేసి ఉంటే ఈ అల్లర్లు జరిగి ఉండేవి కావని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఆమెను సస్పెండ్ చేయడంతో సరిపెట్టిందని, కానీ ఆమెపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని వివరించారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు.
అయితే, హింసకు తాము వ్యతిరేకమని, రాంచీలో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. పోలీసులు చట్టాన్ని చేతులోకి తీసుకోరాదని హితవు పలికారు. అల్లర్లలో పాల్గొన్నవారిపై యూపీ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలకు దిగడాన్ని ఒవైసీ తప్పుబట్టారు. ఒకరి ఇంటిని ధ్వసం చేయడానికి మీరెవరు? శిక్షను నిర్ణయించడానికి మీరేమైనా న్యాయస్థానమా? అంటూ నిలదీశారు.