Goon: జాగ్రత్తగా లేకపోతే.. ఫింగర్ ప్రింట్స్ నూ కొట్టేస్తారు!
- 2,000 వేలి ముద్రలతో పోలీసులకు పట్టుబడిన వ్యక్తి
- వాటి సాయంతో సిమ్ కార్డులు
- వాటితో నకిలీ బ్యాంకు ఖాతాలు
- కేవైసీ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తింపు
నేరగాళ్లు టెక్నాలజీ పరంగా చాలా అప్ డేట్ అవుతున్నారు. పోలీసులు కేసుల విచారణ సందర్భంగా నేరస్థులను ప్రశ్నించినప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నేరగాళ్లు వ్యక్తుల గుర్తింపును కూడా చోరీ చేస్తున్నట్టు తెలిసింది. ఆ గుర్తింపు ఆధారంగా నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి, పెద్ద పెద్ద మోసాలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ సైబర్ పోలీసులు గత నెలలో ఓ నేరస్థుడిని పట్టుకుని విచారించగా అవాక్కయ్యారు. పట్టుబడిన వ్యక్తి వద్ద సుమారు 2,000 మంది వ్యక్తుల వేలిముద్రలు (ఫింగర్ ప్రింట్స్) ఉన్నట్టు తెలుసుకున్నారు. వీటి ఆధారంగా నకిలీ గుర్తింపులను తయారు చేసి, మోసాలకు వినియోగిస్తున్నట్టు బయటపడింది. మరింత విస్తుపోయే విషయం ఏమిటంటే ఆ వేలిముద్రలను అతడు సొంతంగా సంపాదించలేదు. మరో నేరగాడి దగ్గర్నుంచి తీసుకున్నాడు. ఇలాంటి వారు ఎంతో మంది ఉండొచ్చని.. కనుక ప్రజలు తమ గుర్తింపు వివరాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వద్ద నిర్వహించిన ‘సైబర్ భద్రత - జాతీయ భద్రత’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ డీసీపీ కమలేశ్వర్ వివరాలు వెల్లడించారు. చోరీ చేసిన వ్యక్తిగత వివరాల ఆధారంగా.. కొత్త సిమ్ కార్డులు తీసుకోవడం, సోషల్ మీడియా ఖాతాలను తెరుస్తున్నట్టు చెప్పారు.
2,000 వేలి ముద్రలతో పట్టుబడిన వ్యక్తి, అప్పటికే వాటి సాయంతో సిమ్ కార్డులు కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించి..వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డులతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేవైసీ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుసుకున్నారు. పలు బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేశారు. బయోమెట్రిక్ వేలిముద్రలను ఎవ్వరితోనూ పంచుకోవద్దని వారి సూచన. అలాగే, ఆధార్, ఇతర కేవైసీ జిరాక్స్ లు కూడా ఎవరికి పడితే వారికి ఇవ్వొద్దు, జిరాక్స్ కేంద్రాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.