Pawan Kalyan: పార్టీ పనుల కారణంగా 'మేజర్' చిత్రాన్ని ఇంకా చూడలేదు... మహేశ్ బాబుకు నా అభినందనలు: పవన్ కల్యాణ్
- ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మేజర్
- దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ
- స్పందించిన పవన్ కల్యాణ్
- తెలుగు చిత్రసీమ నుంచి ఈ సినిమా రావడంపై హర్షం
- త్వరలోనే మేజర్ చిత్రాన్ని చూస్తానని వెల్లడి
దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన 'మేజర్' చిత్రంపై జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ముంబయి మహానగరంలో 2008 నవంబరు 26న ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలను 26/11 మారణహోమంగా ఈ దేశం గుర్తుంచుకుంది అని వివరించారు. నాడు జరిగిన కమాండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీరమరణాన్ని వెండితెరపై 'మేజర్' గా ఆవిష్కరించిన చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుటున్నట్టు వెల్లడించారు.
పార్టీ పనులతో బిజీగా ఉన్నానని, అందుకే ఇప్పటివరకు 'మేజర్' చిత్రాన్ని చూసేందుకు వీలుపడలేదని వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమాను చూస్తానని తెలిపారు. అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణ గురించి తెలుసుకున్నానని, ఎంతో సంతోషం కలిగిస్తోందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అన్ని భాషల వారిని మెప్పిస్తున్న ఈ చిత్రం తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందదాయకం అని పేర్కొన్నారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వంటి సైనికాధికారులు, సిబ్బంది దేశభద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలని పవన్ అభిలషించారు.
'మేజర్' చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్ బాబును, చిత్ర నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలను అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో నటించిన ప్రకాశ్ రాజ్, రేవతి, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మ, ఇతర టెక్నీషియన్లకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా హీరో అడివి శేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. "మేజర్ చిత్రం కథానాయకుడు, సోదరుడు అడివి శేష్ కు హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత, దివంగత అడివి బాపిరాజు గారి మనవడైన శేష్ సినిమా రంగంలో భిన్న శాఖలపై అభినివేశం ఉన్న సృజనశీలి. తెలుగు సాహిత్యంపై మక్కువ, వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇలాంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సాహసి చిత్రకథను చలనచిత్రంగా మలిచిన దర్శకుడు శశికిరణ్ కు శుభాకాంక్షలు. ఇటువంటి మరెన్నో మంచి చిత్రాలు ఆయన నుంచి రావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పనవ్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.