Congress: గాంధీ ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ పట్ల ఆకర్షితులైనట్టుంది: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
- ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
- ఆందోళనలపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
- రాహుల్ సహా చట్టానికి ఎవరూ అతీతులు కాదని వ్యాఖ్య
- గాంధీల ఆస్తులు కాపాడటానికే నిరసనలంటూ ఆగ్రహం
నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇవ్వడం, తాజాగా సోమవారం ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరవడంపై ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నిరసనలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా సహా మొత్తం గాంధీ ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ పట్ల ఆకర్షితులైనట్లుగా కనిపిస్తోందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
తమ పార్టీ అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే దర్యాప్తు సంస్థపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారని స్మృతి ఆరోపించారు. ఈ నిరసనలు గాంధీ కుటుంబ ఆస్తులను కాపాడేందుకు జరుగుతోన్న ప్రయత్నమేనని ఆమె ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ సహా చట్టానికి ఎవరూ అతీతులు కాదని కూడా ఆమె పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఒకప్పటి వార్తా పత్రిక పబ్లిషింగ్ హౌస్‌పై గాంధీ కుటుంబం ఎందుకు ఆసక్తి చూపుతోందని ఆమె ప్రశ్నించారు.